ఘాజీ సినిమా చూసినవారంతా ఆ సినిమాలో టెక్నికల్ వాల్యూస్ కు ఫిదా అయిపోయారు. సినిమాటోగ్రాఫర్ మాథీ అందరికీ తెలుసు. మన తెలుగు సినిమాలకు కూడా పనిచేసిన ఉద్ధండుడు. కానీ ఘాజీకి బ్యాక్ గ్రవుండ్ స్కోర్ అందించిన కె మాత్రం మనవాళ్లకు పరిచయం తక్కువ. ఎవరీ కే అని చాలా మందే అనుకున్నారు. హాలీవుడ్ రేంజ్ నేపథ్య సంగీతం అందించాడు అతగాడు ఘాజీ సినిమాకు? అందుకే కే..నా? ఎవరు ఇతను అనుకున్నారు.
కే అలియాస్ కృష్ణ కుమార్..కానీ తమిళ సినిమా రంగంలో కె గా కేకె గా పాపులర్. పట్టుమని మూడు పదుల వయసు మాత్రమే. తెలుగువారికి అంతగా గుర్తు వుండకపోవచ్చు కానీ, కొన్ని డబ్బింగ్ సినిమాలు గుర్తుకువస్తే కె గుర్తుకు వస్తాడు. రంగం తరువాత జీవా నటించిన మాస్క్ సినిమాకు కే నే సంగీతం అందించాడు. తెలుగు, తమిళంలో హిట్ అయిన పిజ్జా హిందీ రీమేక్ కు కూడా కె నే బ్యాక్ గ్రవుండ్ స్కోర్ అందించాడు.
ఇక ఘాజీ సినిమాకు కే కనెక్ట్ కావడం చిత్రంగా జరిగింది. ఘాజీ సినిమాలో పాటలు వుండవు. సినిమాను గ్రిప్పింగ్ గా చెప్పడంలో బ్యాక్ గ్రవుండ్ స్కోర్ పాత్ర కూడా కీలకం. ఎవరయితే ది బెస్ట్ అని కిందా మీదా పడ్డారు యూనిట్ అంతా. తెలుగు, హిందీ సంగీత దర్శకుల పేర్లు చాలా డిస్కషన్ కు వచ్చాయి. అలాంటి టైమ్ లో కే పేరు ప్రస్తావనకు వచ్చింది. ఎలా? సినిమాకు ఎడిటర్ గా పనిచేసిన శ్రీకర్ ప్రసాద్ ద్వారా. అంతగా ఎవరికీ పరిచయం లేని కే పేరు చెప్పి, అతనితో చేయించుకోమన్నారు శ్రీకర్ ప్రసాద్. నిర్మాతలకు శ్రీకర్ ప్రసాద్ పై వున్న నమ్మకంతో ఓకె అన్నారు.
అలా ఘాజీ టీమ్ లోకి వచ్చిన కే తన టాలెంట్ మొత్తం ప్రదర్శించాడు. ఆరు వెర్షన్ల బ్యాక్ గ్రవుండ్ స్కోర్ చేసి అందించాడు. దాంట్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఆ విధంగా ఘాజీ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ రెడీ అయింది. అన్నట్లు కే నటుడు కూడా కొన్ని తమిళ సినిమాల్లో నటించాడు కూడా.