'గౌతమి పుత్ర శాతకర్ణి'గా బాలయ్య రాజసం

నందమూరి బాలకృష్ణ హీరోగా, విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. సినిమా షూటింగ్‌ని అనుకున్నట్లుగానే పూర్తి చేశామని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకి సంబంధించి తాజా స్టిల్‌ విడుదలయ్యింది. ఈ స్టిల్‌లో గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన స్టిల్స్ తో పోల్చితే, ఈ స్టిల్ లో మరింత రాజసం కనిపిస్తోంది.

హీరోగా తన కెరీర్‌లో 100వ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మలచుకోవాలనే ఉద్దేశ్యంతో రిస్క్‌ చేసి మరీ, ఈ సినిమాని ఎంచుకున్న బాలకృష్ణ, అంతే డెడికేషన్‌తో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మరోపక్క, బాలకృష్ణ వందవ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు దర్శకుడు. సాధారణంగా ఇలాంటి సినిమాల నిర్మాణమంటే ఏళ్ళ తరబడి జరుగుతుంది. కానీ, క్రిష్‌ అలా కాదు.. పెర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో సినిమా చిత్రీకరణను పూర్తి చేయడం విశేషమే మరి. మొత్తం 79 రోజుల్లో షూటింగ్‌ పూర్తయ్యిందంటోంది చిత్ర యూనిట్‌. 

సినిమాలో బాలకృష్ణ గెటప్‌, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్స్‌.. అన్నీ నభూతో నభవిష్యతి.. అనేలా వుంటాయనీ, ఈ పాత్రలో బాలకృష్ణ తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేమనీ చిత్ర దర్శకుడు క్రిష్‌ చెబుతున్నాడు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌, బాలీవుడ్‌ నటి హేమమాలిని ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు కానున్నారు. అందాల భామ శ్రియ, ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటిస్తోంది.

Readmore!
Show comments