వైఫల్యానికి 'మసి'పూసేస్తున్నారిలా.!

భారతీయుడన్నవాడెవడూ నల్లధనం వెలికితీతను వ్యతిరేకించడు. ఒక్క, 'నల్లదొంగ' తప్ప. దురదృష్టవశాత్తూ ఆ నల్లదొంగలూ మన భారతీయుల్లోనే వున్నారు. వారే బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు. అందులోనూ, అందరూ కాదు. కొందరు మాత్రమే. ఆ కొందరి సంఖ్య 1 శాతం కూడా లేకపోవడం గమనార్హమిక్కడ. ఆ లెక్కన, నూటికి 99 శాతం మంది నల్లధనం వెలికితీతకు మద్దతిస్తున్నవారే. 

సమస్య, నల్లధనం వెలికితీతకు దేశ ప్రజలు మద్దతిస్తున్నారా.? లేదా.? అన్నది కాదు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం అమలు జరుగుతున్న తీరు గురించే చర్చ జరుగుతోంది.. జరగాలి కూడా. 'నిర్ణయం ప్రకటించేశాను.. మీ ఛావు మీరు ఛావండి..' అంటూ విమానమెక్కి విదేశాలకు పారిపోయారు ప్రధాని నరేంద్రమోడీ. ఆ నిర్ణయం తర్వాత దేశంలోని పరిస్థితులపై కనీసపాటి 'మర్యాద' కూడా పాటించలేకపోయారాయన. 

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, దేశ ప్రజల్ని ఉద్దేశించి ఓ సందేశం ఇవ్వాలని ఇప్పటిదాకా నరేంద్రమోడీకి అన్పించకపోవడం దారుణమనాలా.? హేయమనాలా.? ఇంకేమన్నా అనాలా.? 

'నా నిర్ణయాన్ని దేశం సమర్థిస్తోంది..' అని చెప్పుకోడానికి ఓ యాప్‌ తీసుకొచ్చారు నరేంద్రమోడీ. సహజంగానే, ఈ సర్వేలో ఎవరూ వ్యతిరేకంగా ఓటేసే అవకాశం వుండదు. ఎందుకంటే, ఇన్నాళ్ళు నల్లధనంతో నాశనమయ్యాం.. ఇకనైనా బాగుపడతామనే చిన్న ఆశ భారతీయుల్లో కలుగుతోంది ఇప్పుడిప్పుడే. క్యూ లైన్లలో చచ్చిపోతాం.. ఇంకేమైనా కష్టాలు తలెత్తితే అనుభవిస్తాం.. అంటూనే, మా కష్టాల్ని తీర్చండి మహాప్రభో.. అంటూ ప్రధానిని వేడుకుంటోంది దేశ ప్రజానీకం.  Readmore!

కించిత్‌ కూడా ప్రజల కష్టాల పట్ల కలత లేదు ప్రధాని నరేంద్రమోడీకి. ఏమాత్రం వున్నాసరే, ప్రజల కష్టాల్ని ముందే ఊహించి, కనీసం చిన్న నోట్లు అయినాసరే తగినంతగా సిద్ధం చేసుకుని పెద్ద నోట్లను రద్దు చేసి వుండేవారు. నల్ల దొంగలకు వీలుగా 'ఇంకా పెద్ద నోటు'ని తీసుకురావడంలోనే, ప్రధాని ఉద్దేశ్యమేంటన్నది తేటతెల్లమైపోయింది. యాప్‌ పేరుతో నరేంద్రమోడీ చేస్తున్నది కేవలం ప్రచారార్భాటం మాత్రమే. విపక్షాల్ని నిర్వీర్యం చేసేందుకు తప్ప, ఈ సర్వే ఎందుకు ఉపయోగపడ్తుంది.? 

93 శాతం మద్దతిచ్చారని ప్రస్తుతానికి సర్వే ఫలితాలను ఉటంకిస్తూ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దేశం ముక్త కంఠంతో చెబుతోంది 99.9 శాతం మద్దతిస్తున్నామని.. ఇంకా ఈ యాప్‌ ఫలితం ఎందుకట.! పబ్లిసిటీ తర్వాత, ప్రజల కష్టాలను గుర్తెరిగి, ఉపశమన చర్యలు కల్పిస్తే అదే పదివేలు.! కానీ, అంత పెద్ద మనసు పాలకులకెక్కడిది.? అదే వుంటే, దేశమెందికిలా తగలడుతుంది.!

Show comments