మోడీజీ.. నియంతృత్వం తరహా రెఫరండమా!

నోట్ల మార్పిడి అంశంపై  ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అనిపించిందట భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి. దాదాపు పక్షం రోజులుగా దేశం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో.. ముందస్తు ఏర్పాట్లు ఏమాత్రం లేకుండా మోడీ సంచలన రీతిలో తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి ముప్పేట దాడి ఎదురవుతుండగా.. ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పుడు రెఫరండం అంటోంది. 

మరి  రెఫరండం అంటే.. చాలా ధైర్యం ఉన్నట్టే! తాము తీసుకున్న నిర్ణయంపై ప్రజాభిప్రాయాన్ని అప్పటికప్పుడు తీసుకోవడం.. అంటే చాలా గట్స్ ఉండాలి. ఇప్పుడు ఈ గట్సే మోడీకి ఉన్నాయని, ఈ మేరకే ఆయన రెఫరండానికి సిద్ధం అయ్యారని భక్తులు భజన అందుకున్నారు.

అయితే ఈ రెఫరండం ఎలా? అంటే.. అప్లికేషన్ ద్వారానట! కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆ అప్లికేషన్ ను ఇన్ స్టాల్ చేసుకుని.. అందులో అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలట! 

భలే ఉంది కదా.. ఇదెలా ఉందంటే, నియంతృత్వ దేశాల్లో రెఫరండాలు అంటూ ప్రజాభిప్రాయ సేకరణ, ఎన్నికలు జరగుతూ ఉంటాయే.. ఈ మొబైల్ అప్లికేషన్ ముచ్చట అలా ఉంది.

ఈ దేశం ఉన్నజనాభా ఎంత? వారిలో స్మార్ట్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? స్మార్ట్ ఫోన్లను కలిగినప్పటికీ  అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేసుకుని వాడే అవగాహన ఎంత మందికి ఉన్నాయి? స్మార్ట్ ఫోన్ కు ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన వారు ఎంత మంది? అవన్నీ సరే.. ఇప్పుడు నమో అప్లికేషన్ ను ఇన్ స్టాల్ చేసుకునేది ఎంతమంది ? వాటి ద్వారా అభిప్రాయాలు చెప్పే ఓపిక తీరక? ఎంతమందికి ఉంది? నోట్ల మార్పిడి తో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వంద కోట్ల పై జనాభాలో.. ఈ అప్లికేషన్ ద్వారా అభిప్రాయాలు చెప్పే వారి సంఖ్య ఎంత? ఈ రెండింటి మధ్య నిష్ఫత్తి ఎంత?

నియంతృత్వ దేశాల్లో రెఫరండాలు పెట్టి.. 99 శాతం తమకు అనుకూలంగా ఉన్నారని నియంతలు ప్రకటించుకొంటూ ఉంటారు. ఇప్పుడు నమో పాలనలో కూడా ఆ ఛాయలే కనిపిస్తున్నాయి. అప్లికేషన్ల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ అంటూ.. దేశ జనాభాలో కనీసం ఒక్క శాతంలో వెయ్యో వంతు ప్రజలు అభిప్రాయాలను కూడా పరిగణనలో తీసుకోని మార్గం గురించి మాట్లాడుతున్నారు.

అయినా.. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రత్యేక అప్లికేషన్లు ఎందుకు..? కాషాయ చొక్కాలు, మోడీ భక్తులు.. బ్యాంకుల ముందు క్యూల దగ్గరకు వెళితే చాలు కదా!  

Show comments