150 కోట్లు.. ఇంకా కెవ్వు కేక.!

బాలీవుడ్‌ సినిమా 'దంగల్‌' దుమ్ము రేపేస్తోంది. 150 కోట్ల వసూళ్ల మార్క్‌ దాటిందంటూ బాలీవుడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించాడు. విదేశాల్లోనూ 'దంగల్‌' దూకుడు కొనసాగుతోందంటోన్న తరణ్‌ ఆదర్శ్‌, ఆ లెక్కని దాదాపు 100 కోట్లుగా తేల్చాడు. మొత్తంగా 'దంగల్‌' ఇండియన్‌ సినిమా గత రికార్డుల్ని తిరగరాయడం ఖాయమని ఈ రిపోర్ట్స్‌ బట్టి వెల్లడవుతోంది. 

పెద్ద పాత నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ సంక్షోభంలోనూ 'దంగల్‌' తన సత్తా చాటడం విశేషమే మరి. బాలీవుడ్‌ సినీ జనం, 'దంగల్‌' విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆ హీరో, ఈ హీరో.. ఆ హీరోయిన్‌, ఈ హీరోయిన్‌.. అన్న తేడాల్లేకుండా 'దంగల్‌' ప్రమోషన్‌లో తమవంతు సహకారం ఏదో ఒక రకంగా అందిస్తూనే వున్నారు. సోషల్‌ మీడియాలో అయితే, బాలీవుడ్‌ సెలబ్రిటీలందరిదీ ఒకటే మాట, 'దంగల్‌' తమకు ఇటీవలి కాలంలో బాగా నచ్చిన సినిమాల్లో ఒకటని. 

హిందీతోపాటు 'దంగల్‌'ని పలు భారతీయ భాషల్లోనూ విడుదల చేశారు. దాంతో, ఆయా రాష్ట్రాల్లోనూ 'దంగల్‌' వసూళ్ళలో దుమ్మురేపేస్తోంది. రెజ్లింగ్‌ క్రీడ నేపథ్యంలో 'దంగల్‌' తెరకెక్కిన విషయం విదితమే.

Show comments