‘మా పార్టీలోకి వచ్చి చేరితే.. జగన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం..’ అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు! ఇది వరకూ దిగ్విజయ్ సింగ్, ఇటీవల కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి.. ఈ తరహా ప్రకటనలు చేయడం విశేషం. ఏపీలో పార్టీ కోలుకునే అవకాశాలు ఏమీ కనపడకపోవడంతో కాంగ్రెస్ నేతల నుంచి ఈ తరహా ప్రకటనలు వస్తున్నాయి.
ఈ ప్రకటనల్లో కాంగ్రెస్ నేతల మార్కు కామెడీ ఏమీ తగ్గకపోవడం విశేషం. పనబాక లక్ష్మీ ఏమన్నారంటే.. “కాంగ్రెస్ లోకి వచ్చి చేరితే జగనే సీఎం అభ్యర్థి అవుతాడు. జగన్ దళితులను బాగా ఆకట్టుకున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాల లబ్ధి దారులను జగన్ తన వైపు తిప్పుకున్నాడు…’’ అని ఆమె అంటున్నారు. కాబట్టి జగన్ తమ పార్టీ లోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఆమె చెబుతున్నారు.
అయిన ఇప్పుడు పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసి.. కాంగ్రెస్ నుంచి “ముఖ్యమంత్రి అభ్యర్థి’’ అనే దయను పొందాల్సిన అవసరం జగన్ కు ఏమైనా ఉందా? నేనే రాజు.. నేనే మంత్రి.. అన్నట్టుగా జగన్ తన పాట్లు ఏవో తను పడుతున్నాడు. ఇప్పుడు కోరి కాంగ్రెస్ అధిష్టానాన్ని తన నెత్తిన పెట్టుకోవడానికి జగన్ కు ఏం అవసరముంది? అనే బేసిక్ లాజిక్ ను కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు ఈ తరహా ప్రకటనలు చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇలాంటి నేతలు ఉండటం వల్లనే ఆ పార్టీ పరిస్థితి అలా తయారైంది.