నరసింహన్ కు సెలవేనా? ఏపీకి కొత్త గవర్నర్!

కర్ణాటకకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత శంకరమూర్తికి గవర్నర్ పదవిని ఇవ్వాలని భావిస్తోందట ఆ పార్టీ అధిష్టానం. ఈ మేరకు అమిత్ షా తనకు గవర్నర్ పదవి విషయంలో హామీని కూడా ఇచ్చాడని శంకరమూర్తి స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం కర్ణాటక శాసనమండలి చైర్మన్ గా ఉన్నారు ఈయన. తను దక్షిణ భారతదేశాన్ని వీడి వెళ్లనని తనకు ఇక్కడే పదవీయోగం పట్టించాలని శంకరమూర్తి కోరడంతో ఆ మేరకు కూడా షా నుంచి హామీ లభించినట్టుగా తెలుస్తోంది.

దీంతో శంకరమూర్తి.. ఆంధ్ర ప్రదేశ్ లేదా తమిళనాడుకు గవర్నర్ గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రానికి కాంగ్రెస్ నేత అయిన రోశయ్య గవర్నర్ గా ఉన్నారు. అయితే రోశయ్యతో జయలలిత కన్వీనెంట్ గానే ఫీలవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన ను తప్పించడం ఆమెకు ఇష్టం లేకుండా పోతోంది. జయకు ఇష్టంలేని పని బీజేపీ వాళ్లు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో శంకరమూర్తి ఏపీకి గవర్నర్ గా వచ్చే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది.

ప్రస్తుతానికి అయితే.. నరసింహన్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో శంకరమూర్తికి ఉన్నత పదవితో ఉపాధి కల్పించే ప్రక్రియలో భాగంగా నరసింహన్ ను తప్పించి.. ఈ రెండు రాష్ట్రాల గవర్నర్ పదవిని శంకరమూర్తికి ఇస్తారా? నరసింహన్ ను అలాగే ఉంచి, ఏపీకి ప్రత్యేక గవర్నర్ ను తీసుకొస్తారా? అనేది వేచి చూడాల్సిన అంశం.

ఎలాగూ.. ఏపీ వ్యవహారాలను కొత్త రాజధానికి మార్చుకొంటూ వస్తున్నారు. తాత్కాలిక సచివాలయంతో పాటు.. చాన్నాళ్లు ముఖ్యమంత్రి విజయవాడలోనే మకాం వేశారు. ఈ నేపథ్యం లో ఏపీకి ప్రత్యేక గవర్నర్ కూడా వస్తారేమో చూడాల్సి ఉంది. అయితే.. ఉభయ రాష్ట్రాలకూ ఒకే గవర్నర్ ఉంటే, ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని వివాదాల పరిష్కారాలకు(ప్రజా సంబంధమైనవి కాదు, చంద్రబాబు కేసీఆర్ ల మధ్య అంతర్గత పంచాయతీలు) బాగానే ఉపయోగపడ్డారు. అయితే రెండు రాష్ట్రాలకూ వేర్వేరు గవర్నర్లు ఉంటే.. వారు కూడా కలహించుకోవడం మొదలవుతుందేమో అనే ఆందోళన కూడా ఉంది. మరి కమలనాథుడు ఇప్పుడేం చేస్తారో! 

Show comments