అవినీతిలో నెంబర్‌ 1: బాబు ఒప్పుకోలు

'భారతదేశంలో చూసుకుంటే.. అవినీతిలో అయినా, అభివృద్ధిలో అయినా మేమే నెంబర్‌ వన్‌..' 

- ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యలివి. 

ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఆరోపించాల్సిన అవసరం లేదు.. ఇంకెవరో సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన పనే లేదు. తనకు తాను చంద్రబాబు సర్టిఫికెట్‌ ఇచ్చేసుకున్నాక, తన పాలనపై తానే క్లారిటీ ఇచ్చేసిన తర్వాత.. ఇక మాట్లాడుకోవడానికేముంది.? అందుకే, టీడీపీ నేతలు కూడా షాక్‌కి గురయ్యారు. అవును మరి, 'అవినీతిలో మేమే నెంబర్‌ వన్‌..' అని చంద్రబాబు చెప్పడంతో, టీడీపీ నేతలది మాట్లాడలేని పరిస్థితే. 

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యింది మొదలు.. ఆయన మీద అవినీతి ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్తున్నాయి. ఇసుక కుంభకోణం దగ్గర్నుంచి, అమరావతి భూముల కుంభకోణం దాకా.. చంద్రబాబు సర్కార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. 'చినబాబు' లోకేష్‌, మంత్రి నారాయణ, మరో మహిళా మంత్రి.. ఇలా ఒకరేంటి.? టీడీపీలో చాలామందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. 

ప్రతిపక్షం వైఎస్సార్సీపీ సహా, విపక్షాలన్నీ అధికారపక్షంపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూనే వున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల సర్వేల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అవినీతి వ్యవహారం వెలుగు చూస్తూనే వుంది. 'అదంతా ట్రాష్‌..' అంటూ అధికార తెలుగుదేశం పార్టీ ఖండించేస్తూనే వుంది. కానీ, ఇప్పుడు చంద్రబాబే తమ ప్రభుత్వ అవినీతిపై సర్టిఫై చేసేశారు. అదీ అసెంబ్లీ సాక్షిగా. ఇంతకన్నా చంద్రబాబు సర్కార్‌ అవినీతిపై ఇంకేం క్లారిటీ రావాలి.? 

'ఏదో మాట తూలింది..' అని చంద్రబాబు అండ్‌ కో సరిపెట్టుకోవచ్చుగాక.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డగోలుగా వ్యవహరించి, విజయాన్ని అందుకున్న అత్యుత్సాహంలో చంద్రబాబు అసలు విషయాన్ని ఒప్పేసుకున్నారనే విషయం మాత్రం అందరికీ అర్థమయిపోయిందిప్పుడు.

Show comments