బీజేపీ.. పన్నీరును జోకర్ గా మిగులుస్తుందా?

ఇప్పటికే సుబ్రమణ్య స్వామి శశికళకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. కొంతమంది బీజేపీ నేతలు అనవసరమైన రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన విరుచుకుపడుతున్నాడు. సొంత పార్టీ మీదే నిప్పులు చెరుగుతున్నాడు. శశికళ చేత తక్షణం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని  ఆయన డిమాండ్ చేశాడు!

అంతేకాదు.. ఇప్పుడు కమలనాథులకు రాష్ట్రపతి ఎన్నికలు గుర్తుకు వచ్చాయి! రాష్ట్రపతి ఎన్నికల్లో తాము  నిలబెట్టే అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల, ఎంపీల బలంలో అన్నాడీఎంకే గణం కీలకం అవుతుందని కమలనాథులకు గుర్తుకొచ్చింది. దీంతో.. ఈ సమీకరణాలకు అనుగుణంగా తమిళనాడు గేమ్ ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి!

ఏకంగా 135 మంది ఎమ్మెల్యేలు, లోక్ సభ, రాజ్యసభలో కలిపి 50 మంది ఎంపీల బలం కలిగిన పార్టీ అన్నాడీఎంకే. మరి ఇలాంటి ఓట్లను గంపగుత్తగా పొందితే… రాష్ట్రపతి  ఎన్నికల్లో పోరాటానికి చాలా ఊరట లభిస్తుంది. అందునా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో అంత సానుకూల ఫలితాలు వచ్చేలా లేవు. ఇలాంటి నేపథ్యంలో అన్నాడీఎంకే బలం కీలకం కానుంది. మరి ఈ బలాన్ని శశికళ బీజేపీకి ఎరగా వేసే అవకాశాలు లేకపోలేదు!
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలుస్తామనే హామీని ఆమె నుంచి తీసుకుని.. ఆమెను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి బీజేపీ గవర్నర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పన్నీరును నిలబెట్టడం అనేది అంత ఈజీ వ్యవహారం ఏమీ కాదు కమలానికి!

అన్నాడీఎంకే బలాన్ని చీల్చాలి. డీఎంకే బలాన్ని కలుపుకోవాలి. అప్పుడే పన్నీరును నిలబెట్టగలదు. అలా చేస్తే పన్నీరు కు ఆనందం దక్కొచ్చు. కానీ రాజకీయంగా బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలొస్తే.. డీఎంకే బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పన్నీరు, బీజేపీ గాలికి కొట్టుకుపోతారప్పుడు. ధీర్ఘకాలికంగా ప్రయోజనాలు దక్కే అవకాశాలు లేవు. శశిని నిలబెడితే మాత్రం తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి.

Readmore!

ఒకవేళ శశికళ గనుక ఆస్తుల కేసులో మళ్లీ దోషిగా తేలి జైలుకు వెళితే.. అప్పుడు అన్నాడీఎంకే పై బీజేపీ పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తుంది. ఏ తంబిదొరై నో సీఎం స్థానంలో కూర్చోబెట్టడానికీ అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కమలంలో అంతర్మథనం సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

పన్నీరును సగం వరకూ రెచ్చగొట్టి ముందుకు తోసి.. బీజేపీ తన ప్రయోజనాలకు ఇప్పుడు ప్రాధాన్యతను ఇచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇదే జరిగితే.. అతిపెద్ద జోకర్ అయ్యేది ఓపీఎస్! తిరుగుబావుటతో ఈ కాసేపూ హీరో అనిపించుకుంటున్నా.. బీజేపీ – శశికళల మధ్య గేమ్ లో ఆయన రాజకీయ జీవితం పూర్తి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

Show comments