సామంతుడు కాడు...ధీమంతుడా?

తమిళనాడు రాజకీయాలు చిత్రవిచిత్రంగా మారుతున్నాయి. అలా అనుకుంటే ఇలా అవుతోందేమిటి? అని ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రోజుకో రకంగా మలుపులు తిరుగుతున్న అన్నడీఎంకే రాజకీయాల్లో చివరకు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జీవితం ఎలా ముగుస్తుందోనని అనుమానం కలుగుతోంది.

తాజా ట్విస్ట్‌ ఏమిటంటే తనకు సామంతుడిగా ఉంటాడనుకున్న ముఖ్యమంత్రి పళనిసామి 'ధీమంతుడు'గా మారుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. మొన్నీమధ్యే నాటకీయ పరిణామాలు, ఘర్షణల మధ్య పీఠం ఎక్కిన పళనిసామి శశికళ-దినకరన్‌ ద్వయానికి ధిక్కార స్వరం వినిపించారు.

ఇప్పటివరకు మీడియా వేసుకున్న అంచనాల ప్రకారం, చిన్నమ్మ ప్లాన్‌ ప్రకారం పళనిసామి 'జీ హుజూర్‌' టైపులో ఉండాలి. కాని ఆయన చిన్నమ్మ విధేయుడిగా కాకుండా స్వతంత్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని  నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. పదవీ బాధ్యతలు చేపట్టి వారం తిరక్కండానే మొదటి సంకేతం పంపారు. ఇంతకూ పళనిసామి ఏం చేశారు?

ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని శశికళ, దినకరన్‌ అనుకున్నారు. ఎప్పటినుంచో కొనసాగుతున్నవారిని, కీలక పదవుల్లో మాజీ సీఎం పన్నీరుశెల్వం నియమించినవారిని తొలగించి తమవారిని అంటే మన్నార్‌గుడి మాఫియాకు సహకరించేవారిని పెట్టాలనుకున్నారు. దీంతో  పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ బెంగళూరుకు వెళ్లి శశికళను కలుసుకొని మాట్లాడారు. తరువాత ప్రక్షాళన చేయాల్సిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల, ఇతర ఆఫీసర్ల జాబితా తయారుచేసి పళనిసామికి పంపారు. కాని ఆయన జాబితాకు పచ్చ జెండా ఊపలేదు. చిన్నమ్మ ఊహించిన దృశ్యం తిరగబడింది.

తొలగించాల్సిన అధికారుల జాబితాలో మొదటి పేరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ది. జయలలిత చనిపోయాక అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, ఆయన కుమారుడు, బంధువుల ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేసి, సోదాలు నిర్వహించి భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు కనుక్కున్నారు.

ఆ వెంటనే అప్పటి సీఎం పన్నీరుశెల్వం ఆయన్ని తొలగించి గిరిజా వైద్యనాథన్‌ను నియమించారు. రామ్మోహన్‌రావు చిన్నమ్మకు అత్యంత సన్నిహితుడు. గిరిజా వైద్యనాథన్‌కు మంచి అధికారిగా పేరుంది. నిబంధనల ప్రకారం పనిచేస్తారంటున్నారు. కాని జయలలిత తన హయాంలో ఈమెను పక్కకు పెట్టేసింది. ప్రక్షాళన జాబితాలో మంచి అధికారిగా పేరున్న ఆర్థిక శాఖ కార్యదర్శి కె.షణ్ముగం పేరుంది. సమర్ధులైన అధికారులను మార్చడం పళనిసామికి ఇష్టం లేదు. ఇలా చేస్తే అధికార యంత్రాంగంలోకి, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు.

మంచి అధికారుల తొలగింపు కారణంగా అధికార యంత్రాంగంలో తనపై తప్పుడు అభిప్రాయం కలుగుతుందని, బూరోక్రసీతో సంబంధాలు దెబ్బతింటాయని అనుకుంటున్నారు. ఇక్కడ చెప్పుకోవల్సిన విషయం ఒకటుంది. చిన్నమ్మ జైలుకు వెళ్లగానే పలువురు మంత్రులు, నాయకులు వెళ్లి పరామర్శించారు. కాని సీఎం పళనిసామి ఇప్పటివరకు వెళ్లలేదు. విశ్వాస పరీక్షలో నెగ్గగానే జైలుకు వెళ్లి చిన్నమ్మ ఆశీర్వాదం తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కాని అందుకు భిన్నంగా సంక్షేమ పథకాల ఫైళ్లపై సంతకాలు చేసి తాను 'అమ్మ' బాటలో నడవబోతున్నానని ప్రజలకు సంకేతాలు పంపారు.

క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే ఆయన బెంగళూరు వెళ్లలేదని సమాచారం. తాను స్వతంత్రంగా వ్యవహరించే సీఎంనని, శశికళ నీడను కానని ప్రజలకు చూపించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. చిన్నమ్మ మెడ మీద ఎన్నికల కమిషన్‌ కత్తి వేలాడుతున్న విషయం పళనిసామికి తెలుసు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నిక చెల్లదని, పార్టీ నిబంధనావళికి విరుద్ధమని ప్రత్యర్థులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కమిషన్‌ ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే రాజకీయ జీవితం ముగిసినట్లే. అదే జరిగితే దినకరన్‌ తదితర నియామకాలు కూడా చెల్లుబాటు కావు. అందుకే పళనిసామి 'వెయిట్‌ అండ్‌ సీ' అనే ధోరణితో ఉన్నారట.

ఇక పళనిసామితో పదవి కోసం పోటీ పడిన పన్నీరు శెల్వం, ఆయన వర్గంవారు కొత్త సీఎం తొలిరోజే సంక్షేమ పథకాల ఫైళ్లపై సంతకాలు చేయడాన్ని హర్షించారు. భవిష్యత్తులో పళని-పన్నీరు కలిసిపోయినా ఆశ్యర్యం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కదా.

Show comments