నమ్మండి..నమ్మకపొండి..ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసల సారాంశం ఇది. మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా గురించి తెగ తపన పడుతున్నారు. తెగ టెన్షన్ పడుతున్నారు. తెగ కిందా మీదా అయిపోతున్నారు. 149 సినిమాలు చేసిన చిరు కు జయాపజయాలు కొత్త కాదు. ఆయన చూడని ఎత్తు పల్లాలు లేవు. బ్లాక్ బస్టర్లు చూసారు. డిజాస్టర్లు చూసారు. అయితే ఈ 150 వ సినిమాను మాత్రం ఆ అపార అనుభవంతో టేకిట్ ఈజీగా చూడలేకపోతున్నారు.
ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ రావాలి. అద్భుతమై కలెక్షన్లు రావాలి. రికార్డులు నెలకొల్పాలి. ఎలాగైనా సరై బుల్స్ ఐ ని కొట్టి తీరాల్సిందే అని మెగాస్టార్ కిందా మీదా అవుతున్నారని ఇండస్ట్రీ టాక్. కానీ ఆ సినిమాకు మాత్రం రావాల్సినంత హైప్ అయితే రావడం లేదు. సినిమా అమ్మకం దగ్గర నుంచే రికార్డుల సృష్టించాలని ప్రయత్నం జరుగుతోంది. కానీ బేరాలు, ఆరాలు వస్తున్నాయి కానీ, రేట్లు దగ్గరే తేడాగా వుంది. వీళ్లు తగ్గడం లేదు. వాళ్లు పెంచడం లేదు. బాహుబలికి కాస్త తక్కువగా రేట్లు చెబుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. సేల్ ఆశించిన మేరకు కాకపోయినా, ఫిగర్లు అవే చలామణీలోకి తేవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇధిలా వుంటే అమ్మకాల సంగతి పక్కన పెడితే సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ రప్పించాలన్నది మరో టెన్షన్. ఇరవై కోట్లకు పైగా ఓపెనింగ్స్ రప్పించాలన్నది ఆలోచన. కానీ సంక్రాంతి బరిలో బాలయ్య వందో సినిమా కూడా వుంటుంది. అందువల్ల రెండూ ఒకటే రోజు వస్తే కనుక అది అసాధ్యం. సో, ఒక రోజు అటు ఇటుగా వేసుకోవాలి.
అయితే ఇప్పుడు మెగాస్టార్ టెన్షన్ ను అర్థం చేసుకుని అభిమానులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇక నుంచి సినిమా విడుదల తేదీ వరకు అభిమానులు తరచు సమావేశాలు నిర్వహిస్తారట. సినిమాకు ఎలా ప్రచారం తేవాలి. విడుదల తేదీ వరకు అభిమానులను ఎలా సమీకరిచి, సినిమా పై కార్యాచరణ ఇలాంటివి ఈ సమావేశాల్లో డిస్కస్ చేస్తారని వినికిడి. అలాగే ఫ్యాన్స్ అందరూ తొలి రోజు కచ్చితంగా సినిమా చూసేలా, దానికి పకడ్బందీ ఏర్పాట్లు వంటివి కూడా ఆలోచనలో వున్నాయట.
నిజానికి మెగాస్టార్ కావచ్చు, అభిమానులు కావచ్చు, 150 వ సినిమాకు మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, టెన్షన్ పడిపోతున్నారేమో అనిపిస్తోంది. బాలయ్య గానీ, ఆయన అభిమానులు గానీ తన వందో సినిమా గురించి అంతగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రాజెక్టు ఓకె చేసారు. యూనిట్ కు వదిలసారు. నడిచిపోతోంది. అంతకు మించి ఏమీ చేయడం లేదు. మరి విడుదల దగ్గరకు వచ్చాక చేస్తారేమో? మరోపక్క సైలెంట్ గా అమ్మకాలు కూడా ప్రారంభమైపోయాయి. సీడెడ్ కు 9 కోట్లతో బోణీ కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఇది కూడా మెగా సినిమాకు మరి కాస్త టెన్షన్ తెచ్చిపెడుతుంది.
మరోపక్క శాతకర్ణి సినిమా విషయంలో జనాలకు ఆసక్తి కలుగుతోంది. ఎందుకంటే ఎవరికీ తెలియని చరిత్ర. పైగా చారిత్రక సినిమా. అందువల్ల ఆ గెటప్ లు, ఆ వ్యవహారాలు ఎలా వుంటాయో అన్న ఆసక్తి. కానీ, మెగాస్టార్ 150 వ సినిమా వ్యవహరం అలా కాదు. సబ్జెక్ట్ తెలిసిందే. మెగాస్టార్ ను కొత్తగా ఏమీ చూపించేది లేదు. మహా అయితే బాడీ క్లాస్ స్లిమ్ అయ్యి, కాస్త యంగ్ లుక్ వస్తుంది. పైగా ఆ లుక్ లు ఎప్పటి కప్పుడు ఏదో విధంగా చూపించేస్తున్నారు. అందువల్ల ఇంక ఆసక్తి ఏముంటుంది?
అన్నింటికి మించి మెగా సినిమాకు పబ్లసిటీ ప్లానింగ్ కాస్త బ్యాడ్ గా అనిపిస్తోంది. ఓ పద్దతి ప్రకారం ఇప్పటి నుంచి పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్లాలి. సినిమా సంగతులు ఆసక్తి కరంగా మలిచి జనాలకు మెలమెల్లగా ఫీడ్ చేస్తూ రావాలి. ఆ విధంగా జనానికి సినిమాపై ఆసక్తి పెంచాలి. కానీ అలాంటి ప్రయత్నాలు ఏవీ జరగుతున్న దాఖలాలు లేవు. ఈ విషయంలో ఇంకా చిరు, సాంప్రదాయక పద్దతులతోనే వున్నట్లుంది. ఇప్పుడు రోజులు మారాయి. ఇన్నోవేటివ్ పబ్లిసిటీ అవసరం. సినిమా ఈ రేంజ్ లో వుండాలని టెన్షన్ పడే కన్నా, ఈ రేంజ్ కు ఎలా చేరుతుంది..ఎలా చేర్చాలి అనే దిశగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వుంటాయి.