బాబు, జగన్‌.. మధ్యలో ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, 'మేధావి' తరహాలో మాట్లాడుతుంటారు. ఏ విషయం మాట్లాడినా లోతైన పరిశీలన చేసినట్లే మాట్లాడటం ఆయన ప్రత్యేకత. ఎంపీగా, రాజమండ్రి నియోజకవర్గానికి ఏం చేశారు.? అన్న విషయం పక్కన పెడితే, తెలుగునాట ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఒకప్పుఉ పెను సంచలనం. ఆయన పేరు నిత్యం మీడియాలో మార్మోగిపోయేది. కారణం, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి డైరెక్షన్‌లో, ఉండవల్లి - ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై చెలరేగిపోవడమే. 

ఓ దశలో ఉండవల్లి దెబ్బకు రామోజీరావు 'పీఠం' కదిలిపోతుందనేంతలా పరిస్థితులు మారిపోయాయి. మార్గదర్శిపై ఆయన చేసిన పోరు అలాంటిది. కానీ, వైఎస్‌ మరణం తర్వాత ఉండవల్లి చాలా మారిపోయారు. అప్పటిదాకా వైఎస్‌ చాటు ఉండవల్లి కాస్తా.. వైఎస్‌ వ్యతిరేకి ఉండవల్లిగా మారిపోయారు. జగన్‌ని విమర్శించేందుకు రాజశేఖర్‌రెడ్డిని బదనాం చేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌, తాను రాజకీయంగా ఎదిగిందే వైఎస్‌ చలవ కారణంగా అన్న విషయాన్ని మర్చిపోయారు. 

పరిస్థితులు మారిపోయాయి.. మళ్ళీ ఇప్పుడు ఉండవల్లి, వైఎస్‌ జగన్‌ వంక 'ఆశగా' చూస్తున్నారు. చాలా విషయాల్లో వైఎస్‌ జగన్‌కి మద్దతిస్తున్నారు. ఈ క్రమంలోనే, అధికార తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడిపోతున్నారు. రాజకీయ నాయకుడన్నాక ఏదో ఒక స్టాండ్‌ వుండాలి.. పోనీ, అది కొంతకాలమైనాసరే ఓ మాటకు కట్టుబడి వుండాలి. కానీ, ఉండవల్లి ఆ టైపు కాదు. 

లేటెస్ట్‌గా అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ, సెక్రెటేరియట్‌ ప్రాంగణాన్ని సందర్శించారు ఉండవల్లి. ఎలా వుంది.? అని మీడియా అడిగితే, 'బావుందని చెబితే టీడీపీలో చేరతానని మీరు ప్రచారం చేస్తారు.. బాగాలేదని చెబితే వైఎస్సార్సీపీ తరఫున మాట్లాడుతున్నానంటారు..' అంటూ సమాధానం చెప్పకుండా, అతి తెలివి ప్రదర్శించేశారు ఉండల్లి అరుణ్‌కుమార్‌. 

'బాగుంది' అన్న మాట దేశద్రోహం కానే కాదు.. బాగాలేదన్న విమర్శ పాపం కూడా కాదు. కానీ, ఉండవల్లి అతి తెలివి ప్రదర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుని విమర్శించినప్పుడు, 'వైఎస్సార్సీపీ ఏజెంట్‌ ఉండవల్లి' అన్న విమర్శల్ని ఉండవల్లి ఎదుర్కొన్నారు. ఆ విషయం ఆయన మర్చిపోతే ఎలా.? ఆయన మాటల్లో, గోడ మీద పిల్లి వాటం సుస్పష్టమైపోతోంది. చంద్రబాబు పిలిచినా, వైఎస్‌ జగన్‌ ఆహ్వానం పలికినా.. ఉండవల్లి ఎటైనా దూకడానికి సిద్ధమన్నమాట.

Show comments