వర్మ పేల్చితే ఆ కిక్కే వేరప్పా.!

రామ్‌గోపాల్‌ వర్మ 'న్యూక్లియర్‌' బాంబు పేల్చుతానంటున్నాడు. 'న్లూక్లియర్‌' పేరుతో వర్మ సినిమా తీస్తున్నట్లు ప్రకటించగానే, ఆ వార్త నిజంగానే బాంబులా పేలింది. ఒకప్పటి వర్మకీ ఇప్పటి వర్మకీ చాలా తేడాలున్నాయి. కొన్ని సన్నివేశాల్ని వర్మ మాత్రమే డీల్‌ చేయగలడనిపిస్తుంటుంది. ఇప్పటికీ వర్మలో ఆ 'స్పెషాలిటీ' అలాగే వున్నా, ఎందుకో దాన్ని ఆయన విరివిగా వాడడంతే. 

మామూలుగా ఎప్పుడు ఏది హాట్‌ టాపిక్‌ అయితే, దాన్ని తన సినిమాకి కథాంశంగా మార్చేసుకోవడం వర్మ స్టయిల్‌. అనూహ్యంగా వర్మ ఈసారి 'న్యూక్లియర్‌ బాంబ్‌'ని తన కొత్త సినిమా కథాంశంగా మార్చేసుకున్నాడు. అయితే 'వంగవీటి' తీస్తునట్లు, 'సర్కార్‌' తీసినట్లు, 'న్లూక్లియర్‌' తీసేస్తానంటే కుదరదు. ఈ మధ్య వర్మ తీస్తోన్నవన్నీ చిన్న సినిమాలే. టెక్నాలజీని వాడుకుని, సినిమా ఖర్చుని తగ్గించేస్తున్నాడు. ఎటూ వర్మ బ్రాండ్‌కి ఇంకా సేలబిలిటీ వుండడంతో ఆ సినిమాలు గట్టెక్కేస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం. 

కానీ, వర్మ ఇప్పుడు భారీ సినిమా అంటోంటేనే, కొత్తగా అనుమానాలు తెరపైకొస్తున్నాయి. న్లూక్లియర్‌ బాంబ్‌ - తీవ్రవాదం నేపథ్యంలో సినిమా వర్మ తెరకెక్కిస్తున్నాడంటే సహజంగానే ఉత్కంఠ షురూ అయ్యింది. నిజంగానే వర్మ, తన మార్క్‌ సంచలనం 'న్లూక్లియర్‌'తో క్రియేట్‌ చేయగలుగుతాడా.? ఏమో మరి, ఇంత సీరియస్‌ సబ్జెక్ట్‌ని పట్టుకున్నాక, వదిలి పెట్టడనే అనుకుంటున్నారంతా. అయినా ఎక్కడో మళ్ళీ అనుమానాలు.. కొన్ని సినిమాలు స్టార్ట్‌ చెయ్యడం, వదిలెయ్యడం వర్మకి అలవాటే కదా. 

'నయీం' సినిమా రావాల్సి వుంది.. 'సర్కార్‌-3' లైన్‌లోనే వుంది.. 'వంగవీటి' సంగతి సరే సరి.. ఇంకొన్ని సినిమాలు సెట్స్‌ మీదకు వచ్చినవి, అనౌన్స్‌ అయినవీ వున్నాయి. మరి, వర్మ నిజంగానే 'న్యూక్లియర్‌' సెట్స్‌ మీదకు తీసుకొస్తాడా.? ప్రపంచ సినిమాగా పేర్కొంటున్న వర్మ 'న్లూక్లియర్‌'తో నిజంగానే సంచలనాల్ని నమోదు చేస్తాడా.? వేచి చూడాల్సిందే.

Show comments