చితక్కొట్టిన 'చీపురుకట్ట'

చీపురు పార్టీ చితక్కొట్టింది. ఇక్కడ బాధితుడు కూడా చీపురు పార్టీకి చెందిన వ్యక్తే. అయితే, ఇటీవల పార్టీకి ఎదురుతిరిగాడాయన. అద్గదీ అసలు విషయం. జీఎస్టీపై చర్చ కోసం ఢిల్లీ అసెంబ్లీ సమావేశమయ్యింది. ఈ క్రమంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే కపిల్‌ మిశ్రా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంకేముంది, చీపురు పార్టీ శాసనసభ్యులకి ఒళ్ళు మండిపోయింది. చితక్కొట్టేశారంతే. 

రాజకీయాల్లో కొత్త 'మార్పు'కి శ్రీకారం చుడుతూ, 'చీపురు' పార్టీ అదేనండీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన విషయం విదితమే. పుడుతూనే మార్పు కోసమంటూ నినదించారు సరే, ప్రస్తుత రాజకీయాల్లో ఇమడొద్దూ.? అందుకే, చీపురు పార్టీ నేతలూ నానా కంగాళీ చేసేశారు రాజకీయాల్లో. అవినీతి ఆరోపణలు, మహిళలతో అసభ్యకర ప్రవర్తనలు.. ఒకటేమిటి, చీపురు పార్టీని చెత్త చెత్తగా మార్చేశారు. ఎవరన్నా ప్రశ్నిస్తే, ఇదిగో ఇలా చితక్కొట్టుడు.! 

అసెంబ్లీలో చితక్కొడితే అంత సీరియస్‌ అయిపోవాలా.? అన్నదే కదా మీ డౌట్‌.! అయితే, అది మీ తప్పు కాదు. ఎందుకంటే, పార్లమెంటులోనూ చితక్కొట్టుకున్నారు. అదీ ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయే సందర్భంలో ప్రవేశపెట్టిన విభజన బిల్లుపై చర్చ సమయంలో. చట్ట సభలన్నాక వాదోపవాదాలు సహజం. కొట్టుకోవడం కూడా అప్పుడప్పుడూ సహజమే. చట్ట సభలు ఎంత గొప్పగా వర్ధిల్లుతున్నాయో కదా.! 

గట్టిగా అనకండి, చట్ట సభల్ని ప్రశ్నిస్తే మళ్ళీ మీ మీద కేసులు పెట్టొచ్చుగాక.! చంద్రబాబు సర్కార్‌, ఆంధ్రప్రదేశ్‌లో పెద్దల సభను కించపర్చారంటూ సోషల్‌ మీడియాపై కక్ష సాధింపు చర్యలు షురూ చేసిన సంగతి తెలుసు కదా. రేప్పొద్దున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా అదే పని చేసినా చేస్తారు. సమాజాన్ని ఉద్ధరించాల్సిన చట్ట సభల్లో, శాసనాలు చేయాల్సినవారు నిస్సిగ్గుగా కొట్టుకుంటున్నా.. ప్రశ్నించలేని దుస్థితి. ఇది కదా ప్రజాస్వామ్యమంటే.!

Show comments