చంద్రబాబు భజనే.. రెడ్ల జనోద్ధరణ!

చంద్రబాబుకు మా కులం రుణపడి ఉంటుంది.. అంటూ తనేదో రెడ్లకు కులగురువును అయినట్టుగా మాట్లాడతారు, మరోవైపు రెడ్లను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారు.. అంటూ ఆందోళన వ్యక్తం చేస్తారో..  ఏమిటో ఈ దివాకర్‌ రెడ్డి. ఈయన బాధేంటో అర్థంకాదు. తెలుగుదేశంలో తమమాట చెల్లడం లేదని కుండబద్ధలు కొడతారు, అలా నిరాశవాదాన్ని వ్యక్తం చేసినంతలోనే బాబు భజన అందుకుంటారు, ఉన్నవీ లేనివి కలిపి బాబును పొగిడేస్తారు. అలా భజన చేస్తే.. అయినా బాబు కరుణిస్తాడేమో అనే ఆశ అగుపిస్తుంది వీరి మాటల్లో. అయితే అవతల ఉన్నది చంద్రబాబు నాయుడు. జేసీ సోదరులకు ఈ మాత్రం స్కోప్‌ ఇచ్చేలా లేడు.

ఇప్పుడు కాదు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ల దక్కరకు వస్తే అప్పుడు ఉంటుంది పీకులాట! అవతలో జగన్‌ మీద ఇష్టానుసారం మాట్లాడి తలుపులు మూసేసుకున్నారు. ఇప్పుడు సాధించుకుంటే తెలుగుదేశంలో సాధించుకోవాలి. లేకపోతే.. లేదు! తమను తాము కార్నర్‌ చేసుకుంటున్న మహా మేధావులు జేసీ సోదరులు.

తమ తోకకు తామే నిప్పెట్టుకోవడం వీరి ప్రత్యేకత. ఈ వైనంబెట్టిదో అంతా గమనిస్తూనే ఉన్నారు.మరి ఇలాంటి నేపథ్యంలో దివాకర్‌ రెడ్డి రెడ్లను అణగదొక్కేస్తున్నారు.. అంటూ, ''రెడ్డి గర్జన''లో వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. తను ఏం చేస్తున్నానో.. తన సాటి రెడ్లంతా చూస్తున్నారని జేసీకి తెలియదు కాబోలు! తను చేసే చంద్రబాబు భజనే రెడ్ల జనోద్ధరణ అని జేసీ భావిస్తున్నాడు పాపం.

అవతల తెలుగుదేశం పార్టీలోని రెడ్లు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పల్లె రఘునాథ రెడ్డి వంటి సీనియర్‌ను, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ల పాటూ కూడా పక్కచూపులు చూడకుండా.. పని చేసిన వ్యక్తిని నిర్ధయగా పదవి నుంచి తొలగించారు. 

ఇక మరోవైపు వాకాటిపై ఆరోపణలొస్తే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అచ్చం అలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న గంటా, సుజనా చౌదరిల మీద మాత్రం చర్యల్లేవు. వాకాటి మీదే సస్పెన్షన్‌ వేటు. ఇక బాబుతో పాటు ప్రమాదాన్ని ఎదుర్కొన్న బొజ్జల సంగతి సరేసరి. భూమా నాగిరెడ్డిని నానారకాలుగా హింసపెట్టి కాటికే పంపించేశారు పాపం! ఇక మోదుగుల వంటి వారి ఆవేదనలు సరేసరి. పల్లె రఘునాథరెడ్డికి అయితే చీఫ్‌విప్‌ పదవిని ఇస్తామని చెప్పి.. ప్రకటించి.. చివరకు అది ఇవ్వకుండా అవమానించారు. 

ఇలా చెప్పుకొంటూపోతే.. తెలుగుదేశం పార్టీలో రెడ్ల దీనగాథలు ఎన్నో. మరి ఇలాంటి నేపథ్యంలో జేసీ ఆవేదన ఒక ప్రహసనం. అందుకే ఆఖరికి జేసీ ప్రసంగాన్ని ఆయన సాటి రెడ్లే అడ్డుకున్నారు! సభకు వచ్చిన జనసందోహం లేని రెడ్లే.. జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదీ కథ. అయినా జేసీ ఏం మాట్లాడినా, ఎవరిపై విరుచుకుపడినా.. ఊదు కాలదు, పీరు లేవదు.. అన్నట్టుగా మారిపోయి చాలా కాలం అయినట్టుంది కదా!

Show comments