'బాబు బాగా..'నే లెక్కలేశాడు

'బాహుబలి' తప్ప, ఇంకో సినిమా గురించి మాట్లాడుకునేలా లేరిప్పుడు సగటు సినీ అభిమానులు. ఈ టైమ్‌లో అవసరాల శ్రీనివాస్‌ 'బాబు బాగా బిజీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మే 5న 'బాబు బాగా బిజీ' సినిమా విడుదల కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పబ్లిసిటీ దంచేస్తున్నారు. 

బాలీవుడ్‌ మూవీ 'హంటర్‌'కి ఇది తెలుగు రీమేక్‌. అసలు ఇలాంటి సినిమాలు తెలుగు తెరపై ఎంతవరకు సక్సెస్‌ అవుతాయి.? అన్న అనుమానాలు చాలానే వున్నాయి. అవసరాల శ్రీనివాస్‌ మాత్రం, సినిమా చూస్తే ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయంటున్నాడు. తానెందుకు ఈ సినిమా చేయాల్సి వచ్చిందో అందరికీ అర్థమవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అఫ్‌కోర్స్‌, సినిమా రిలీజ్‌కి ముందు పబ్లిసిటీ కోసం ఈ తరహా మాటలు కొత్తేమీ కాదనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, సినిమా విషయానికొస్తే.. 'హంటర్‌' సినిమాలో కావాల్సినంత అడల్ట్‌ కంటెంట్‌ వుంది. పోర్న్‌ సినిమా తరహాలో కాకపోయినా, మరీ సీ-గ్రేడ్‌ అడల్ట్‌ కంటెంట్‌ కాకపోయినా.. తెలుగు సినిమాకి సంబంధించినంతవరకు ఇది 'ఓవర్‌ డోస్‌ అడల్ట్‌ కంటెంట్‌' అని చెప్పక తప్పదు. తెలుగు నేటివిటీ కోసం చాలా మార్చామంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. అదెంతవరకు నిజమోగానీ ప్రోమోస్‌ చూస్తోంటే మాత్రం, ఇదేదో 'తేడా వ్యవహారం' అన్పించకమానదు. అది కూడా ఓ పబ్లిసిటీ జిమ్మిక్కే.

'హంటర్‌' స్థాయిలో వల్గర్‌ కంటెంట్‌ లేకపోయినా, ఆ ఫీల్‌ వచ్చే 'నాటీ' కంటెంట్‌ అయితే సినిమాలో వుండడం ఖాయం. అదొక్కటీ చాలదా, ఓ వర్గం ఆడియన్స్‌ని థియేటర్లకు పరుగులు పెట్టించడానికి. అంతా బాగానే వుందిగానీ, 'బాహుబలి' మేనియాలో 'బాబు బాగా బిజీ' పరిస్థితి ఏంటట.? ఏముంది, 'బాహుబలి' తప్ప ఇంకే సినిమాలూ లేవు గనుక, తమకు ప్లస్‌ అవుతుందన్నది 'బాబు బాగా బిజీ' టీమ్‌ అంచనా. బాగానే లెక్కేశారు కానీ వేసిన లెక్కలకు తగ్గ ప్రతిఫలం లభిస్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments