అరాచకం.. అయినా అడిగే దమ్మెవరికి.?

గుంటూరు ఛైర్‌పర్సన్‌ జానీ మూన్‌ కుటుంబ సభ్యుల్ని సాక్షాత్తూ మంత్రిగారే వేధిస్తున్నారట. సదరు మంత్రి ఎవరో కాదు, 'ది గ్రేట్‌' రావెల కిషోర్‌బాబు. ఎందుకు ఆయన 'ది గ్రేట్‌' అంటే, ఆయనపై వున్నన్ని వివాదాలు బహుశా ఆంధ్రప్రదేశ్‌లో ఇంకే ఇతర మంత్రుల మీద లేవేమో.! ఆ స్థాయిలో రావెల కిషోర్‌బాబు 'ది గ్రేట్‌' అన్పించేసుకున్నారు. ఈయనగారు, ఈయనగారి అనుచరుల వల్ల తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని వుందని జానీ మూన్‌ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడిపెట్టారు. పార్టీ అధిష్టానానికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన తర్వాత వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయని వాపోయారామె. 

మామూలుగా అయితే, ఇలాంటి సందర్భాల్లో నిర్భయ కేసులో ఇంకో కేసులో పెట్టాలేమో.! కానీ, అక్కడ జరుగుతున్నది చంద్రబాబు సర్కార్‌ పాలన కదా. ఈ పాలనలో అరాచకాలు సర్వసాధారణం. ఓ ఎమ్మెల్యే, ఓ అధికారిని కొట్టినా, తిట్టినా, ఈడ్చుకెళ్ళినా 'అబ్బే, అందులో సదరు మహిళా అధికారిణిదే తప్పు..' అని తేల్చేస్తారు. ఇంకో ఎమ్మెల్యే, 'మనం అమ్మాయి కన్పిస్తే ఊరుకుంటామా, కడుపు చేసెయ్యాల్సిందే..' అంటాడు, బాబుగారి జమానా కదా.. అలాంటి వాటికి పేటెంట్‌ హక్కులు టీడీపీ నేతలు పొందినట్టున్నారు.! 

సిగ్గు సిగ్గు అనాలా.? ఇంకేమన్నా అనాలా.? ఏమన్నా అనుకోండి, ఇది నిప్పు నారా చంద్రబాబునాయుడుగారి పాలన. అందుకే, ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అన్నా సరే మేం లెక్క చేయం.. అంటారు టీడీపీ నేతలు. పైగా, ఇక్కడ బాధితులే నేరస్తులవుతారు. ఎగ్జాంపుల్‌ కావాలంటే, ఎమ్మెల్యే ఓ అధికారిని కొట్టిన ఘటననే తీసుకోండి. 

రావెల కిషోర్‌బాబుపై ఆరోపణలు ఇప్పుడు కొత్తగా వస్తున్నవేమీ కావు. ఆయనగారి పుత్రరత్నం హైద్రాబాద్‌లో ఓ మహిళపై దౌర్జన్యం చేయడం అప్పట్లో పెద్ద వివాదమే అయ్యింది. అమరావతి భూముల కుంభకోణంలోనూ రావెల కిషోర్‌బాబుపై కుప్పలు తెప్పలుగా ఆరోపణలు వచ్చిపడ్డాయి. ఇంత 'ఘన చరిత్ర' వున్నా, రావెల మాత్రం సేఫ్‌.. ఎందుకంటే, ఆయన 'నిప్పు' నారా చంద్రబాబునాయుడుగారికి అత్యంత సన్నిహితుడు. 

'మా పాలనలో ఆడపడుచులకు పూర్తి భద్రత కల్పిస్తాం.. వారి కంట కన్నీరు కారనివ్వం.. వారినే యజమానుల్ని చేస్తాం..' అంటూ వేదికలెక్కి ప్రసంగాలు చేస్తారు చంద్రబాబు. ఓ మహిళా ఎమ్మెల్యేని టీడీపీలోకి లాక్కున్న రోజే, జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ జానీ మూన్‌ కంటతడిపెట్టారు.. సొంత పార్టీ నుంచే వేధింపుల్ని ఆమె తట్టుకోలేకపోయారు. అరాచక పాలన తమకు అలవాటే గనుక, చంద్రబాబు సర్కార్‌ ఈ 'కన్నీరు'కీ మేకప్‌ వేసెయ్యొచ్చుగాక, బుకాయించొచ్చుగాక.. కానీ, అన్నీ రికార్డ్‌ అవుతాయి ప్రజల మెదళ్ళలో. పనిష్‌మెంట్‌ మాత్రం ఎన్నికల క్షేత్రంలో తప్పదు.

Show comments