దిలీప్ చుట్టూ ఉచ్చు.. మొబైల్ బ్రేకింగ్ కు రంగం సిద్ధం

మలయాళ నటుడు దిలీప్ కుమార్ మరిన్ని చిక్కుల్లో పడబోతున్నాడు. ఇప్పటివరకు కేవలం కొన్ని సాక్ష్యాధారాల ఆధారంగానే అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ సాక్ష్యాలు కూడా బలంగా ఉండడంతో అతడు రెండోసారి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది. కొచ్చిలోని అంగమళై కోర్టు, దిలీప్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

ప్రస్తుతం ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న దిలీప్ బెయిల్ నిరాకరణతో ఇంకాస్త ఇబ్బంది పడ్డాడు. ఇప్పటికే వారం రోజులుగా జైలు జీవితం అనుభవిస్తున్న ఈ హీరో, పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. ఏమడిగినా నాకేం తెలీదంటూ సమాధానమిస్తున్నాడు. జైలులో కూడా తన హీరోయిజం చూపిస్తూ జోకులేస్తున్నాడట. విచారణను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడట.

దిలీప్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు ఇప్పుడు తమ దగ్గరున్న అతిపెద్ద ఆయుధాన్ని బయటకు తీస్తున్నారు. అదే దిలీప్ మొబైల్ ఫోన్. ఇప్పటికే ఈ హీరోకు చెందిన 2 సెల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. త్వరలోనే ఆ మొబైల్ ఫోన్లను బ్రేక్ చేస్తారట.

ఈ ఫోన్లను బ్రేక్ చేయడానికి అనుమతి కోరుతూ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి ఇస్తే మాత్రం దిలీప్ జాతకం మొత్తం బయటపడుతుంది. అప్పుడు సాక్ష్యాలు మరింత బలంగా తయారయ్యే అవకాశం ఉంది.

ఈ నెల 25వరకు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటాడు దిలీప్. మొబైల్ సాక్ష్యాధారాలు కూడా బలపడితే, కస్టడీని పొడిగించే అవకాశముంది. నటి భావనపై లైంగిక, భౌతిక దాడి చేయాల్సిందిగా కోటిన్నర రూపాయలిచ్చి కిరాయి రౌడీలను పురమాయించాడనేది దిలీప్ పై ఉన్న ప్రధానం అభియోగం.

Show comments