అమెరికాలోని చిరుద్యోగులను, నిరుద్యోగులను రెచ్చగొట్టడానికి ట్రంప్ వుపయోగిస్తున్న ట్రంప్ కార్డ్ - వలస కార్మికుల కారణంగా ఆర్థిక సంక్షోభం కలుగుతోంది. వారందరినీ పంపించివేయాలి అనే నినాదం. అతను ఆగస్టు మూడోవారంలో తన కాంపెయిన్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించుకున్న స్టీఫెన్ బానన్ ఎచ్-1బి వీసాలకు బద్ధవిరోధి. వేలాది భారతీయ నిపుణులు అమెరికా వచ్చేందుకు అనువుగా వున్న ఎచ్-1బి వీసాలకు వ్యతిరేకంగా రైట్‌వింగ్‌కు చెందిన బానన్ బ్రియట్‌బార్ట్ న్యూస్ అనే వెబ్‌సైట్ ద్వారా చాలాకాలంగా ఉద్యమం నడుపుతున్నాడు. 2015 నవంబరులో ఒక యింటర్వ్యూలో సిలికాన్ వాలీలో వున్న కంపెనీలలో 65% మంది సిఇఓలు ఆసియన్లే అని వాపోయాడు. ఇటువంటివాడు సారథిగా వుంటే ట్రంప్ ఎంత రెచ్చిపోతాడో వూహించుకోవచ్చు. కానీ యిటీవల ట్రంప్ ధోరణిలో మార్పు వచ్చింది. ఉపన్యాసాల్లో ఘాటు తగ్గించాడు. ఎందుకంటే పోలండ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వలస కార్మికుల చేత గతంలో తనే పని చేయించుకున్నాడన్న విషయం ఆగస్టు నెలాఖరులో పత్రికల్లో వచ్చేసింది కాబట్టి!
మాన్‌హట్టన్‌లోని ట్రంప్ టవర్స్ అనే భవనసముదాయం ట్రంప్ వ్యాపారసామ్రాజ్యానికి ఆయువుపట్టు. అతని కాంపెయిన్ నడిచేది కూడా అక్కణ్నుంచే. అది కట్టడానికి ముందు అక్కడ బాన్‌విట్ బిల్డింగు వుండేది. దాన్ని పడగొట్టి 50-50 పద్ధతిపై యీ టవర్స్ డెవలప్ చేసే పనిని 1979లో ట్రంప్ తలకెత్తుకున్నాడు. అది కమ్మర్షియల్ జోన్ కాదని అభ్యంతరాలు వస్తూంటే రాజకీయనాయకులకు విరాళాలిచ్చి, న్యూయార్క్ బోర్డులోని సభ్యులను మెత్తబరచి మినహాయింపు సాధించాడు. 12 అంతస్తుల భవంతి కూలగొట్టే ప్రారంభించాడు కానీ అది మెల్లగా సాగుతోంది. 1979 చివర్లో ఒకసారి అతను సైట్ దగ్గరకు వచ్చినపుడు పక్కనున్న సైట్‌లో కన్‌స్ట్రక్షన్ చెత్తను శుభ్రం చేస్తున్న పోలిష్ పనివారు పనిచేస్తూండగా చూశాడు. ఎవరు వీళ్లు? అని అడిగితే అక్రమంగా వలస వచ్చినవాళ్లు. అన్‌డాక్యుమెంటెడ్ పనివారు. యూనియన్ (చట్టబద్ధమైన) వర్కర్లలా కాకుండా, పనిగంటల గురించి పేచీ పెట్టకుండా, అతి కొద్ది కూలీకి, కష్టపడి పనిచేస్తారని ఫోర్‌మన్ చెప్పాడు. వాళ్లను పనిలో పెట్టిన కంపెనీ యజమాని విలియం కస్‌జైకీని ట్రంప్ తన ఆఫీసుకి రమ్మనమని కబురు పెట్టాడు. ఆ కంపెనీకి అప్పటిదాకా కిటికీలు శుభ్రం చేయడం, నిర్మాణం జరిగే సైట్‌ను శుభ్రపరచడం తప్ప పెద్ద భవంతులు కూల్చడంలో అనుభవం లేదు. ''నువ్వు కొత్త కంపెనీ ఒకటి ప్రారంభించి యీ పని కూడా చేపట్టు. పనివాళ్లకు వేరే యిన్సూరెన్సు తీసుకో. మా పనికి 7,75,000 డాలర్లు చెల్లిస్తా. అనుకున్నదాని కంటె త్వరగా పూర్తి చేసే పైన పాతికా కలిపి 8 లక్షల డాలర్లిస్తా.'' అన్నాడు ట్రంప్. కస్‌జైకీ ఎగిరి గంతేశాడు. 1980 జనవరి నుంచి పొరుగున చేస్తున్న పనిలోంచి పోలిష్ పనివారు వంతుల వారీగా బయటకు వచ్చేసి యిక్కడ పని చేపట్టారు. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా ఒక షిఫ్టు. సాయంత్రం 6 నుంచి, పొద్దున్న 6 దాకా మరో షిఫ్టు చొప్పున పన్నెండేసి గంటల షిఫ్టుల్లో మూణ్నెళ్ల పాటు పని చేశారు. కొందరు 24 గంటల షిఫ్టు కూడా చేశారట. గంటకు 4 నుంచి 5 డాలర్ల దాకా వాళ్లకి కూలీ ముట్టింది. అప్పట్లో యూనియన్ కార్మికుడికి గంటకు 10 డాలర్ల దాకా యివ్వాల్సి వచ్చేది. పైగా యిన్ని గంటలు వాళ్లు పనిచేయరు కాడా!
గోడలు పడగొట్టడం, పైపులు కోయడం, ఎలక్ట్రిక్ వైర్లు బయటకు లాగడం వంటి ప్రమాదకరమైన పనులన్నీ సరైన భద్రతా సామగ్రి లేకుండానే పోలిష్ కార్మికులు చేసేవారు. కనీసం గట్టి టోపీలైనా వుండేవి కావు. ఓ రోజు పెద్ద ఉక్కు దూలం అల్బిన్ అనే ఒక పనివాడి చేతి మీద పడి అతని చెయ్యి విరిగింది. ఇంత కష్టపడి పనిచేసినా పనివాళ్లకు కస్‌జైకీ జీతాలు సరిగ్గా చెల్లించేవాడు కాదు. దాంతో వాళ్లు అక్కడకు కాస్త దూరంలోనే వున్న జాన్ జాబో అనే న్యాయవాది దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు. జాబో కస్‌జైకీ కోసం ప్రయత్నిస్తే అతను ఫ్లారిడాలో వుంటున్నాడని తెలిసింది. అప్పుడు ట్రంప్ ఆఫీసులో ఆపరేషన్స్ విభాగంలో వైస్ ప్రెసిడెంటుగా పని చేస్తూ యీ కూల్చివేత పనిని స్వయంగా పర్యవేక్షిస్తున్న థామస్ మకారీకి ఫోన్ చేశాడు. పనివాళ్లకు జీతాలివ్వకపోతే ట్రంప్ టవర్స్‌పై 'మెకానిక్స్ లియన్' (బకాయి పడిన జీతాలకు బదులుగా పనివాడికి అక్కడ కట్టిన ఆస్తిలో వాటా యిస్తారు) యివ్వాలంటూ కోర్టుకెక్కుతానని చెప్పాడు. ఇది ట్రంప్ దాకా వెళ్లడంతో అతను పనివాళ్లను స్వయంగా కలిశాడు. కస్‌జైకీ తప్పుకుంటే తనే స్వయంగా వాళ్లకు బకాయి పడిన జీతాలిస్తానని చెప్పాడు. మకారీ సంతకంతో బ్యాంకు ఖాతా తెరిచి, దానిలోంచి డబ్బులు విత్‌డ్రా చేసి పనివాళ్లకు రొక్కంలో చెల్లించాడు. ఇది కొద్దికాలమే సాగింది. పనివాళ్లలో కొంతమందికి జీతాలు ముట్టలేదు. చేయిపోయాక ఫోర్మన్‌గా మారిన అల్బిన్ ట్రంప్ ఆఫీసుకి వెళ్లి అడిగాడు. 'వాళ్ల తాలూకు డబ్బు నేను కస్‌జైకీకి ముందే చెల్లించాను కాబట్టి మీరు వెళ్లి అతన్నే అడగాలి' అని ట్రంప్ జవాబిచ్చాడు.
1980 జూన్ వచ్చేసరికి పోలిష్ వర్కర్ల జీతాల బకాయి మొత్తం లక్ష డాలర్లయింది. వాళ్లు గొడవ చేయసాగారు. ట్రంప్‌కు ఏం చేయాలో పాలుపోక డేనియల్ సలివాన్ అనే లేబరు కన్సల్టెంట్‌ను కలిశాడు. ట్రంప్ న్యూ జెర్సీలో కడుతున్న కాసినో గురించిన ఒప్పందం గురించి అతను సాయపడుతున్నాడు. ఈ పోలిష్ వర్కర్ల విషయం చెప్పగానే అతను తెల్లబోయాడు ''ఇక్కడ యింత పెద్ద ప్రాజెక్టు చేతిలో పెట్టుకుని అక్కడ అక్రమంగా వలస వచ్చిన కార్మికుల చేత చట్టవిరుద్ధంగా పని చేయించుకుంటావా? మీ కంపెనీ ఉద్యోగి ద్వారా డైరక్టుగా జీతాలిస్తున్నావా? ఇది బయటకు వస్తే నీ పరువు నిలుస్తుందా? బ్లాక్‌లిస్టు అయిపోవా? నీకే మాత్రం బుర్రున్నా వెంటనే వాళ్లను ఉద్యోగాల్లోంచి పీకేయ్'' అని చెప్పాడు. అయినా ట్రంప్ లక్ష్యపెట్టలేదు. పని కొనసాగించాడు. 1980 జూన్ 27న జాబో ట్రంప్ ఆఫీసుకి వెళ్లి మెకానిక్స్ లియన్ నోటీసు సెర్వ్ చేశాడు. పోలిష్ కార్మికులు కంపెనీ వైస్ ప్రెసిడెంటు మకారీని బిల్డింగు మీద నుండి వేళ్లాడదీస్తామని బెదిరించారు. అప్పుడు ట్రంప్ సలివాన్‌కు ఫోన్ చేశాడు. 'సెప్టెంబరు 1 కల్లా బాన్‌విట్ బిల్డింగు కూలగొట్టకపోతే నేను రియల్ ఎస్టేటు టాక్స్ కింద భారీ మొత్తం కట్టాల్సి వస్తుంది.' అని మొత్తుకున్నాడు. 'ఇప్పటికైనా పోలిష్ పనివారిని తప్పించి యూనియన్ కార్మికులను పనిలో పెట్టుకో' అని సలివాన్ సలహా యిచ్చాడు.
ఈ లోగా జాబో రెండవ, మూడవ నోటీసు కూడా సెర్వ్ చేశాడు. ఆగస్టు 8న మకారీకి ఫోన్ చేసి 'ట్రంప్ నేరుగా జీతాలు చెల్లిస్తున్నందున అతనే వారి యజమాని (ఎంప్లాయర్) అవుతాడని, అందువలన ఫెయిల్ లేబర్ స్డాండర్డ్‌స్ చట్టం ప్రకారం వారి బకాయిలు చెల్లించనిదే బిల్డింగులో ఒక్క అంగుళం కూడా ఎవరికీ అమ్మలేడ'ని స్పష్టం చేశాడు. 45 ని||ల తర్వాత 'ట్రంప్ ఆఫీసులోని లీగల్ డిపార్టుమెంటు నుంచి బ్యారన్‌ను మాట్లాడుతున్నా' అంటూ ఒకతను ఫోన్ చేసి 'నువ్వు అక్రమంగా మెకానిక్స్ లియన్ నోటీసులు మాకు యిస్తున్నందున నీ పై 100 మిలియన్ డాలర్లకు కేసు వేయబోతున్నా' అని చెప్పాడు. నిజానికి ఆ పేరుతో ఏ ఉద్యోగీ లేడు. ఇబ్బందులు వచ్చినపుడు ట్రంప్, అతని ఆఫీసులో మరో ఉన్నతోద్యోగి ఆ మారుపేరు పెట్టుకుని మాట్లాడడం కద్దు. ఆ విషయం ట్రంపే కోర్టులో చెప్పాడు. జాబో తన చర్యలను సమర్థించుకుంటూ ఆగస్టు 18న బ్యారన్ పేర పెద్ద ఉత్తరం పంపాడు. కొన్ని రోజుల తర్వాత ట్రంప్ లాయరు ఇర్విన్ డర్బెన్ జాబోకు ఫోన్ చేసి 'మీరు కేసు విత్‌డ్రా చేసుకోకపోతే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేచురలైజేషన్ సర్వీసుకి ఫిర్యాదు చేసి యీ పోలిష్ వర్కర్లందరినీ దేశం నుంచి పంపించివేస్తాడు జాగ్రత్త' అని హెచ్చరించాడు. జాబో ఫిర్యాదు మేరకు 1980 ఏడాది చివరకి వచ్చేసరికి, ట్రంప్, కస్‌జైకీ అక్రమ కార్మికుల సేవలు వినియోగిస్తున్నారన్న విషయంపై లేబరు డిపార్టుమెంటు విచారణ జరిపింది. ఒక యిన్వెస్టిగేటర్‌ను సైట్‌కి పంపి ఎవరు పనిచేస్తున్నారో చూడమంది. ట్రంప్ సలివాన్‌కు ఫోన్‌కు చేసి ఆ యిన్వెస్టిగేటర్ సంగతి చూసుకోమన్నాడు. చివరకు కోర్టు కేసులో జాబో, లేబరు డిపార్టుమెంటు నెగ్గాయి. కస్‌జైకీ 2,54,524 డాలర్లు చెల్లించవలసి వచ్చింది. ట్రంప్ ఏమీ చెల్లించనక్కరలేక పోయింది.
ఈ కేసు సంగతి ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు, కేసుకి సంబంధించిన రికార్డులు 36 ఏళ్లగా భద్రపరచేవారూ కాదు - ట్రంప్ చేసిన మరో అక్రమంపై కేసు పడకుండా వుండి వుంటే! హౌస్ రెకర్స్ యూనియన్ (ఇళ్లు కూల్చే పనివారి సంఘం) తాలూకు లోకల్95 అనే సంస్థ వుంది. కూల్చే పనిలో పాలు పంచుకుంటున్న పనివారి పేర - వారు చట్టబద్ధంగా పనిచేసినా, చట్టవిరుద్ధంగా పనిచేసినా - పని చేసిన గంటకు యింత చొప్పున, పెన్షన్, వెల్‌ఫేర్ ఫండ్ (సంక్షేమ నిధి)కై కాంట్రాక్టర్లు ప్రతి నెలా యూనియన్‌కు డబ్బు కడుతూ వుండాలి. ట్రంప్ టవర్స్‌పై పనిచేస్తున్న పనివారిలో ఎక్కువగా పోలిష్ వారు, వారి కంటె బాగా తక్కువ సంఖ్యలో చట్టబద్ధమైన యూనియన్ వర్కర్లు యిద్దరూ వున్నా కేవలం యూనియన్ వర్కర్ల పేర మాత్రమే ట్రంప్, కస్‌జైకీ డబ్బులు కట్టారు. పోలిష్ వారి గురించి నోరెత్తకుండా లోకల్95 సభ్యులను మేనేజ్ చేశారు. అయితే దానిలో సభ్యుడిగా వున్న మాజీ బాక్సర్ హేరీ డైడక్ కొన్నాళ్లకు దీనితో విభేదించాడు. అతను అతని లాయర్లు కలిసి 1983లో కస్‌జైకీ మీద, యూనియన్ ప్రెసిడెంటు మీద, ట్రంప్ మీద కేసులు వేశారు. ట్రంప్ అతని భాగస్వాములు పెన్షన్ ఫండ్‌కు 6 లక్షల డాలర్లు యివ్వాలని క్లెయిమ్ చేశారు. హేరీ లాయర్లు గుట్టల కొద్దీ డాక్యుమెంట్లు సేకరించారు. ట్రంప్ వారిని అడుగడుగునా ప్రతిఘటిస్తూనే వచ్చాడు. కింది కోర్టులో దోషి అని తీర్పు వస్తే అప్పీలుకి వెళ్లాడు. ఆ కేసు 15 ఏళ్లు నడిచింది. ముగ్గురు జడ్జిలు మారారు. 1998లో తనకు శిక్ష తప్పదని తెలిసిన దశలో ట్రంప్ కోర్టు బయట సెటిల్ చేసుకున్నాడు. అతను ఎంత యిచ్చుకున్నాడో ఎవరికీ తెలియదు. ఈ కథనాన్ని బయటపెట్టిన ''టైమ్'' ఆ డీల్ బయటపెట్టాలని కోర్టును కోరుతోంది.
ఈ కేసు వలన ఆ రికార్డులన్నీ ఫెడరల్ కోర్టులో భద్రపరచారు. అప్పుడు ట్రంప్ అనేకమంది వ్యాపారస్తుల్లో ఒకడు. మరి యిప్పుడు? అయితేగియితే దేశాధ్యక్షుడు. అందుకే యివన్నీ బయటకు లాగుతున్నారు. ఆ రికార్డులు అందివచ్చాయి. 'అక్రమకార్మికుల కారణంగానే మనవాళ్ల ఉద్యోగాలు పోతున్నాయి' అంటూ ఉపన్యాసాలు దంచుతున్న ట్రంప్ యిప్పుడు మెత్తబడక తప్పటం లేదు.
(ఫోటో - ట్రంప్ టవర్స్ కనస్ట్రక్షన్ సైట్‌లో ట్రంప్ ఫోటో, 1980)
- ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2016)