ఖంగుతిన్న కేసీఆర్‌

తాను ఎప్పుడు అడిగితే మోడీ అప్పుడు అపాయింట్‌మెంట్‌ ఇస్తారని ఇంతవరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మురిసిపోయేవారు. కాని వర్గీకరణపై కేసీఆర్‌ సారథ్యంలో రావాల్సిన అఖిలపక్షానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చివరి నిమిషంలో అపాయింట్‌మెంట్‌ రద్దు చేయడంతో కేసీఆర్‌ ఖంగుతిన్నారు. 
 
అయినప్పటికీ ఆయన ఢిల్లీ వచ్చి రెండు రోజులు మకాం వేసి బీజేపీ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. పార్లమెంట్‌లో మోడీ ఉన్నప్పటికీ కేసీఆర్‌కు ఆయన దర్శనం దొరకలేదు. దీనితో తన ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ గడిపారు. టీవీలో బడ్జెట్‌ చూసిన వెంటనే కేసీఆర్‌ కాకతగిలి, ఏయ్‌ జితేందర్‌ ఈ బడ్జెట్‌లో ఏమీలేదు.. వెళ్లి లోక్‌సభలో తీవ్రంగా విమర్శించు.. అని అరిచారు.
 
దీనితో అప్పటివరకూ బీజేపీని పొగుడుతున్న జితేందర్‌ రెడ్డికి లోక్‌సభలో బడ్జెట్‌కు వ్యతిరేకంగా మాట్లాడక తప్పలేదు. కేసీఆర్‌కు ఎప్పుడు వేడి వస్తుందో ఎప్పుడు చల్లారుతుందో పార్టీ నేతలు తెలుసుకోలేకపోతున్నారు. ఒకరోజు మోడీని గీడీ అంటారు. మరో రోజు మెచ్చుకుంటారు.. అని వారు వాపోతున్నారు.

Show comments