బాలయ్యా.. జర జాగ్రత్త.!

స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర.. అంటూ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రేపిన దుమారం, పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. చంద్రబాబు కనుసన్నల్లో బాలకృష్ణ, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను తెరకెక్కించేయొచ్చుగాక. అదేమీ పెద్ద విషయం కాదు. దీనికోసం బాలయ్య చెబుతున్నంత రీసెర్చ్‌ కూడా అవసరం లేదు. ఎందుకంటే, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర అంటే అది జగమెరిగిన సత్యం. 

ఎప్పుడైతే బాలకృష్ణ, స్వర్గీ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానన్నారో, ఆ వెంటనే 'తస్మాత్‌ జాగ్రత్త బాలయ్యా..' అంటూ పలువురు ప్రముఖులు మీడియా ముందుకొచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ఈ లిస్ట్‌లో అందరికన్నా ముందున్నారు. నాదెండ్ల భాస్కరరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు.. 'స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర'లో వాస్తవాలు చూపించకపోతే, అది పరిపూర్ణమైనదన్పించుకోదని తెగేసి చెబుతున్నారు. 

వాస్తవాల్ని వక్రీకరిస్తే కోర్టుకెళతామని లక్ష్మీపార్వతి, నాదెండ్ల భాస్కరరావు ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసేశారు. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుదీ ఇదే మాట. చంద్రబాబు కోణంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర తెరకెక్కితే, అందులో పై ముగ్గురూ విలన్లే అవుతారు. తాము విలన్లమని వాళ్ళెలా ఒప్పుకుంటారు.? ఛాన్సే లేదు. కాదని, బాలకృష్ణ ముందడుగు వేస్తే, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర పేరుతో మరికొన్ని సినిమాలొచ్చేందుకు ఆస్కారముంది. ఈ విషయమై ఇప్పటికే ఆ ముగ్గురి నుంచీ సంకేతాలు వెల్లడవుతుండడం గమనార్హం. 

మొత్తమ్మీద, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర.. ఇంకా పట్టాలెక్కకుండానే వివాదాస్పదమవుతోంది. సినిమా అన్నాక వివాదాలు మామూలే. కానీ, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర చుట్టూ వివాదాలు మరింత ఆసక్తికరంగా వుంటాయి. సినిమాని అడ్డుకోవడం కన్నా, తమ ఆలోచనలతో సినిమా తెరకెక్కించేయడమే మేలన్న భావన తెరపైకొస్తే.. ఇక బాలయ్య సినిమా పరిస్థితేంటట.? అందుకే, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర విషయంలో బాలయ్య తొందరపడకపోవడమే మంచిదేమో.!

Readmore!

Show comments