ఇలా అయితే.. ఎంపీలు ఎలా బతుకుతారు పాపం!

ఇంతలోనే మరోసారి ధరల పెంపా! ఎంపీలు ఎలా బతుకుతారు? పాపం! ఈ ఏడాది జనవరిలో ఒకసారి పార్లమెంటు క్యాంటీన్లో ధరల పెంపు జరిగింది. ఇంతలోనే మరోసారి అక్కడ ఆహార పదార్థాల ధరల పెంపుకు సిఫార్సు చేసింది ఎంపీల కమిటీ. 

దేశంలోనే అత్యంత తక్కువ ధరలకు రుచికరమైన, పోషకార మిళితమైన భోజనం దొరికేది పార్లమెంట్ క్యాంటీన్ లోనే అని వేరే చెప్పనక్కర్లేదు. రెండు మూడేళ్ల కిందట పార్లమెంటు క్యాంటీన్ లో ఆహార పదార్థాల ధరల పట్టిక ఒకటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో షేర్ అవుతూ.. సామాన్యుడిలో ఆగ్రహావేశాలను రేకెత్తిస్తూ వచ్చింది. సబ్సిడీ ధరలతో ఎంపీలకు భోజనాలు అందిస్తున్నారు.. వారికి పావలాలకు, రూపాయిలకే సుష్టుగా భోంచేసే అవకాశాన్ని ఇస్తూ.. ప్రతియేటా కొన్ని కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా అందరికీ అవగాహనలోకి వచ్చింది.

అయితే ఎంపీలు మాత్రం నిస్సిగ్గుగా  ఆ సబ్సిడీ ధరలతో భోజనాలు చేస్తూ బతికారు. కోట్ల రూపాయలకు అధిపతులు, వ్యాపార సామ్రాజ్యాధినేతలు అయిన ఎంపీలు.. తాము తినే తిండి విషయంలో కూడా జనాలపై భారాన్ని మోపుతూ వచ్చారు. అయితే ఎట్టకేలకూ ఈ విషయంలో ఈ ఏడాది జనవరిలో కొంత మార్పు వచ్చింది. 

అటు ఇటుగా.. ఈ ధరలను రెట్టింపు చేశారు. అయినప్పటికీ.. పార్లమెంటు క్యాంటీన్ చౌక ధరల హోటల్ గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ .. ఈ ధరలను పెంచే విషయాన్ని పరిశీలించాలని పార్లమెంటరీ కమిటీకి సూచించిందట. దీనిపై ఆ కమిటీ పరిశీలన చేసి.. ఉభయ సభలకూ తమ నిర్ణయాన్ని తెలియజేయనుంది.

మరి.. ఈ సారి ఎంపీల నుంచి కచ్చితంగా అభ్యంతరాలు వచ్చే అవకాశాలున్నాయి. జనాలు ఛీదరించుకుంటున్నారని.. జనవరిలో ధరల  పెంపుకు ఒప్పుకున్నారు. ఈ సారి మాత్రం  “అయ్యో..ధరలు పెరిగితే ఎలా, జనాల మీద పడి బతకడం అలవాటైన మేం బతకడం ఎలా..’’ అని కొంతమంది ఎంపీలపైనా ఆందోళన వ్యక్తం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Show comments