పూర్తి చేస్తారా? 'అసంపూర్తి'లోనే సమావేశాలా?

ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌కు అసెంబ్లీ సమావేశాలు కచ్చితంగా స్వరాష్ట్రంలోనే జరగాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. అది త్వరలోనే నెవవేరే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు లేదా జనవరిలో జరుగుతాయంటున్నారు. వానాకాల సమావేశాలు హైదరాబాదులో నిర్వహిస్తేనే ఆయన విలవిల్లాడిపోయారు. గత్యంతరం లేక సరేనన్నారు. శీతాకాల సమావేశాలు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక అసెంబ్లీలోనే నిర్వహించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. పట్టుదల బాగానే ఉంది. కాని అసెంబ్లీ భవనం మొత్తం పూర్తి చేసి, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాకే నిర్వహిస్తారా? 

హైదరాబాదుకు పోకూడదనే పంతం కోసం అసంపూర్తి భవనంలోనే, అరకొర సౌకర్యాలతోనే నిర్వహిస్తారా? ఈ సందేహం ఎందుకు కలుగుతోంది? అనే ప్రశ్న రావొచ్చు. ఆమధ్య హైదరాబాదులో నిర్వహించిన సమావేశాల ముగింపు రోజునే 'వచ్చే సమావేశాలు స్వరాష్ట్రంలోనే జరుగుతాయి. హైదరాబాదులో ఇవే చివరి సమావేశాలు' అని సీఎం చంద్రబాబు, కోడెల ప్రకటించారు.  అలా ప్రకటించిన తరువాత అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తికాకపోయినా నిర్వహించాల్సిందే. మళ్లీ హైదరాబాదుకు వెళితే పరువు పోయిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక హైదరాబాదులోని ఏపీ సచివాలయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వెలగపూడికి తరలించాల్సిందేననే పట్టుదలతో, పంతంతో అది మొత్తం పూర్తికాకపోయినా చంద్రబాబు తరలించేశారు. 

డెడ్‌లైన్ల మీద డెడ్‌లైన్లు పెట్టి ఉద్యోగులకు నిద్ర పట్టకుండా చేసి అసంపూర్తి సచివాలయానికి వచ్చి తీరాల్సిందేనని భీష్మించారు. ఇందుకు కారణం నోటుకు ఓటు కేసని ప్రచారం జరుగుతోంది. వెలగపూడి సచివాలయం అద్భుతంగా ఉందని, సకల సౌకర్యాలతో, సెంట్రల్‌ ఏసీతో తీర్చిదిద్దారని టీడీపీ అనుకూల మీడియాలో యమ ప్రచారం చేయించారు. టీవీలో ఒక రోజంతా కథనాలు ప్రసారం చేయించారు. 'అద్భుతం' అని ఉద్యోగుల చేత చెప్పించారు. కాని ఈ సచివాలయంలో ఉద్యోగులు అనేక బాధలు పడుతున్నారని, సరైన సౌకర్యాలు లేవని మీడియాలో కథనాలొస్తున్నాయి. 

జనరేటర్లు, ఇన్వెర్టర్లు లేకపోవడంతో కరెంటు పోతే నానా తిప్పలు పడుతున్నారని 'పచ్చ' పార్టీ అనుకూల పత్రికలో కథనం రాగా, ఈరోజు 'సాక్షి'లో మరో కథనం ప్రచురితమైంది. నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉండటంతో దుమ్ముధూళి కారణంగా ఉద్యోగులు పనిచేయలేకపోతున్నారు. ఇంకా ఛాంబర్లు నిర్మిస్తూనే ఉన్నారు. ఇదివరకే నిర్మించినవాటిని వాస్తు బాగాలేదనే కారణంతో కూలగొట్టి మళ్లీ కడుతున్నారు. సచివాలయం చుట్టుపక్కలంతా పొలాలే కదా. అక్కడి నుంచి ఒకవిధమైన పురుగులు సచివాలయంలోకి  వస్తున్నాయి. వాటి ద్వారా వస్తున్న కంపును భరించలేక ఉద్యోగులు సతమతమవుతున్నారు. 

ల్యాండ్‌ లైన్‌ ఫోన్లు లేవు. టాయిలెట్ల నిర్వహణ సరిగా లేదు. క్యాంటీన్‌ సక్రమంగా లేదు. ఇంకా చెప్పాలంటే సచివాలయానికి చిరునామాయే లేదు. దాని అడ్రసు ఇప్పటికీ కేరాఫ్‌ హైదరాబాదే. గొప్పగా ప్రచారం చేసుకున్న సచివాలయం పరిస్థితి ఇలా ఉంటే అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉంటుందో....! ఇవి ప్రజలు, ఉద్యోగుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నవి కాదు కదా. పాలకులు తమ పంతం కోసం నిర్మిస్తున్నారు. అనుకున్న సమయంకల్లా అసెంబ్లీ పూర్తవుతుందని కోడెల చెప్పారు. సచివాలయం విషయంలోనూ ఇదే చెప్పారు. అయిందా? ఏదైనా అంటే రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, ఇది మనం కోరుకున్న విభజన కాదని, కట్టుబట్టలతో వచ్చామని చెప్పిన పురాణమే చెబుతుంటారు. దానికి  దీనికి సంబంధం ఉందా? 

అసెంబ్లీని అత్యాధునికంగా నిర్మిస్తున్నామని, సకల సౌకర్యాలుంటాయని కోడెల చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ భవనాలను పరిశీలించి అత్యుత్తమ డిజైన్‌తో నిర్మిస్తున్నామన్నారు. తాత్కాలిక అసెంబ్లీకి ఇంత హడావుడి అవసరమా? ఎంత అత్యుత్తమంగా, అత్యాధునికంగా నిర్మించినా అధికార, ప్రతిపక్షాలు కొట్టుకోవడమే సరిపోతుందిగాని ప్రజా సమస్యలు చర్చకు వ స్తాయా? రాజధాని ప్రాంతంలో తాత్కాలిక అసెంబ్లీ భవనం నిర్మించి గత ఏడాది శీతాకాల సమావేశాలు అక్కడే నిర్వహించాలని కోడెల ప్లాన్‌ చేశారు. అంతా ఖరారు చేశాక ఐదు రోజుల కోసం కోట్లు ఖర్చు పెడతారా? అంటూ  విమర్శలొచ్చాయి. 

ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాలకు అర్జెంటుగా అసెంబ్లీ భవనం నిర్మించడం అవసరమా? అంటూ అనేకమంది విమర్శించారు. ఇది వృథా ఖర్చని బాబు కూడా అభిప్రాయపడటంతో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. చివరకు అద్దె భవనంలోనైనా సరే నిర్వహించాలని కోడెల అప్పట్లో పట్టుబట్టారు. మొన్న వానాకాల సమావేశాలు ఆంధ్రాలోనే నిర్వహించాలని కోడెల పంతం పట్టారు. కాని సాధ్యం కాలేదు. హైదరాబాదు అసెంబ్లీకి అధికారికంగా, బహిరంగంగా వీడ్కోలు పలికారు కాబట్టి వచ్చే సమావేశాలు వెలగపూడిలోనే నిర్వహించక తప్పదు. అసెంబ్లీ నిర్మాణం  సచివాలయ నిర్మాణంలా  కాకుండా ఉంటే మంచిది. 

Show comments