చిరు టెన్షన్ 151 కోసమా?

చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ను లాంచ్ చేసినపుడు కూడా ఇంత టెన్షన్ పడలేదేమో? ఇంత హంగామా చేయలేదేమో? ఇన్ని జాగ్రత్తలు తీసుకోలేదేమో?  అంత టెన్షన్ పడుతున్నారు తన 150 వ సినిమాకు. అంత హంగామా చేస్తున్నారు తన తాజా సినిమాకు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా గ్యాప్ తరువాత చేస్తున్న సినిమాకు. టీజర్ రిలీజ్ కే  అడియో ఫంక్షన్ లెవెల్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. కత్తిలాంటోడు అనే కత్తి లాంటి టైటిల్ పక్కన పెట్టి, కాస్త డబ్బింగ్ సౌండ్ వచ్చినా సరే, ఖైదీ నెంబర్ 150 అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సెంటిమెంట్ తో ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు బోగట్టా.

అయితే కేవలం ఒక సినిమా హిట్ కావడం కోసమే చిరంజీవి ఇదంతా చేస్తున్నారా? ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎన్నో సూపర్ డూపర్ హిట్ లు తన ఖాతాలో వేసుకున్న చిరుకు ఒక్క సినిమాపై ఎందుకింత టెన్షన్? 150 వ సినిమా కదా..హిట్ కొట్టి తీరాలి అనేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తుంటే, టాలీవుడ్లో వేరే ఆన్సర్ వినిపిస్తోంది. చిరంజీవి జాగ్రత్తలు అన్నీ ఈ 150 వ సినిమా కోసం కాదట. ఆయన 151,152 ఇలా ఇంకా సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. అవి చేయాలి అంటే 150 వ సినిమా హిట్ అయి తీరాలి. ఎన్టీఆర్, ఎఎన్నార్ ల తరువాత 60 దాటినా హీరోలుగా ఎక్కువ కాలం చేసిన వారు ఎవరు లేరు. హీరో కృష్ణ చేసారు కానీ, పెద్దగా కాదు. అందుకే చిరంజీవి మరి కొన్నాళ్లు హీరోగా కొనసాగాలని కోరుకుంటున్నారని, కనీసం మరో నాలుగైదు సినిమాలు చేయాలని అనుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్.

అలా జరగాలి అంటే ఈ 150 వ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. అసలే బ్రూస్ లీ సినిమా డిజాస్టర్ కావడం చిరుకు చిన్నపాటి షాక్ ఇచ్చింది. చాన్నాళ్ల తరువాత తను తెరపై కనిపించినా, జనం రాలేదేమిటా? అని అందుకే ఈ 150ని ఎలాగైనా జనానికి చేరువ చేసి, 151 , 152 అంటూ కంటిన్యూ చేయాలన్నది అసలు ప్లాన్ గా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ 150 ని ఓ ఫౌండేషన్ గా ప్లాన్ చేస్తున్నారట.

Show comments