తలా ఓ బిస్కెట్ వేసి, చోద్యం చూస్తున్న చంద్రబాబు

నామినేటెడ్ పదవుల పందేరం అనే వ్యవహారం తెరమీదకు వచ్చిన ప్రతిసారీ.. కార్యకర్తలు, పార్టీలో పదవులు ఆశించే నాయకులతో ఓ ఆటాడుకోవడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అలవాటే. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి ఛైర్మన్ పదవిని భర్తీ చేయాల్సిన సమయం ఆసన్నం కాగానే.. చంద్రబాబునాయుడు మళ్లీ తన గేమ్‌ప్లాన్ తెరమీదకు తెచ్చారు. రాష్ట్రంలో చాలా మంది రాజకీయ ప్రముఖులు మంత్రి పదవి కంటె ఉన్నతమైందిగా భావించే టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవిని కట్టబెట్టడం గురించి.. ఇప్పటికే పలువురిలో ఆశలు రేకెత్తిస్తూ చంద్రబాబునాయుడు ఆటాడుకుంటున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. 

టీటీడీ ఛైర్మన్ పదవికి ఎంతో ప్రయారిటీ ఉంది. చాలా మంది సీనియర్ నాయకులు ఈ పదవికోసం ఎగబడుతుంటారు.  మొన్నటి వరకు ఆ పదవిలో తిరుపతికి చెందిన కాపు నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వనందుకు ఊరడింపుగా టీటీడీ ఛైర్మన్ పదవిని ఎరగా వేసిన చంద్రబాబు.. చదలవాడకు ఆ పదవిని రెండు పర్యాయాలు కట్టబెట్టారు. ఇప్పుడు ఆ పదవి ఖాళీ అయింది. దాని మీద ఆశలు పెంచుకుంటున్న వారు మాత్రం మెండుగానే ఉన్నారు. ఎంపీలు మురళీమోహన్, రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులు గట్టిగా ఆ పదవి కోరుకుంటున్నారు. రిటైర్డు ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ వంటివారు కూడా రేసులో ఉన్నారు. కాపు వర్గం వారి చేతిలో ఉన్న పదవి ఖాళీ అయిన నేపథ్యంలో  మళ్లీ కాపులకే అవకాశం కల్పించాలంటూ జ్యోతుల నెహ్రూ వంటి వారు కూడా పదవిని ఆశిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు ఆశావహులతో గేమ్ ఆడుతున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. రకరకాల సోర్సెస్ నుంచి రకరకాల పుకార్లను వ్యాప్తిలోకి తేవడం ద్వారా , ఆయా పుకార్ల పర్యవసానాలను గమనించే పనిలో చంద్రబాబు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఫలానా వారికి టీటీడీ ఛైర్మన్ పదవి ఖరారైందంటూ ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి. అయితే.. పదవి విషయంలో చంద్రబాబు మాత్రం ఎటూ తేల్చకుండా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రం పదవిని కట్టబెట్టేది లేదని ఆయన సూత్రప్రాయంగా నాయకులతో అన్నట్లుగా సమాచారం.

చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ముద్దుకృష్ణమనాయుడుకు కట్టబెట్టాలని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా ఒక ప్రచారం ఉంది. సీనియర్ అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి కూడా దక్కలేదని, వయసు పైబడి, ఆరోగ్యం కూడా సహకరించకుండా ఉన్న ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడితే.. రెండేళ్లు భగవత్సేవలో ఉంటారని చంద్రబాబు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి పదవిలోకి ఎవరు వచ్చినా సరే.. వారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అయిఉంటారనే ప్రచారం కూడా పార్టీలో ఉంది. 

చంద్రబాబు వేర్వేరు నాయకుల పేర్లను మీడియాలోకి లీకులు ఇచ్చి.. మిగిలిన నాయకుల స్పందనల్ని గమనిస్తున్నారని, తొందర్లోనే టీటీడీ ఛైర్మన్ పదవిని ఒక కొలిక్కి తెస్తారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి నాయకులకు బిస్కెట్ లు వేసి ఆనందించడం చంద్రబాబుకు ఆటగా మారిపోయిందని.. ఆశావహులకు ఆయన మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని పలువురు అనుకుంటున్నారు.

Show comments