వృద్ధనారీ పతివ్రత.. అని వెనకటికి ఓ ముతక సామెత వుంది. దాని సంగతెలా వున్నా, రాజకీయ నాయకులకు వయసైపోయాక సిద్ధాంతాలు గుర్తుకొస్తున్నాయి. ఇక, ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదన్న నిర్ణయానికి వచ్చేసినవారంతా, 'ఎన్నికల్లో ఇక పోటీ చేయబోం.. కొత్తతరానికి అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం..' అని చెబుతుంటారు. నాయకత్వ లక్షణాలు అటకెక్కడంతో, తమనెవరూ పట్టించుకోరన్న విషయాన్ని గుర్తెరిగి, అవమానాలు కొనితెచ్చుకోలేక రిటైర్మెంట్‌ని ప్రకటించడం మామూలే. దానికేమో, ఇంత కలరింగ్ ఇవ్వాలా.? అదే మరి, రాజకీయం అంటే.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగారున్నారు.. 'ఇకపై నేను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేది లేదు..' అంటారాయన. రికార్డు స్థాయిలో మూడుసార్లు బీజేపీ నుంచి ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేనప్పుడు నామినేటెడ్ పదవుల్ని తెచ్చుకోవాలా.? ఇదేనా, నాయకత్వ లక్షణమంటే.! ఆ ఒక్కటీ అడగొద్దంతే.
తాజాగా, ఈ కేటగిరీలోకి మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేరిపోయారు. ఆయన, ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోరట. అంటే, ఇకపై ఆయన రాజ్యసభకు మాత్రమే వెళతారన్నమాట. జాతీయ పార్టీలకు ఈ విషయంలో ఎడ్జ్ వుంటుందిగానీ, ప్రాంతీయ పార్టీల్లో అవకాశాలు చాలా తక్కువే. కాంగ్రెస్‌లో ఒకప్పుడు సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగిన జేసీ దివాకర్‌రెడ్డి, 2019 ఎన్నికల సమయంలో పార్టీ మారితే, ఏమో.. రాజ్యసభ ఛాన్స్ రావొచ్చేమో.! అంతకన్నా ముందే, చంద్రబాబుని బుజ్జగించి, రాజ్యసభ ఛాన్స్ దక్కించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
పెద్దల సభ.. అంటే, దానికో గౌరవం వుంది. దానర్థం, వయసు మళ్ళిన నాయకులకు, అది ఓ 'గ్యారేజ్' అని ఏమాత్రం కాదు. కానీ, రాజ్యసభకు అర్థం మార్చేశారు నేటి తరం రాజకీయ నాయకులకి. ఏం చేస్తాం, అదంతే.