పవర్‌స్టార్‌ 'చీప్‌' పబ్లిసిటీ స్ట్రాటజీ

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 'చీప్‌' పబ్లిసిటీ స్ట్రాటజీ పాటిస్తున్నాడా.? టాలీవుడ్‌లో కొందరు ఔననే అంటున్నారు. తన తాజా చిత్రం నుంచి పవన్‌కళ్యాణ్‌, దర్శకుడు ఎస్‌జె సూర్యని తప్పించేసి, 'గోపాల గోపాల' ఫేం డాలీకి ఆ ఛాన్స్‌ ఇచ్చిన విషయం విదితమే. పవన్‌కళ్యాణ్‌ తప్పించడం కాదు, నటుడిగా బిజీ అవడం వల్ల ఎస్‌జె సూర్య ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. అబ్బే, అదేం లేదు.. కథ, కాకరకాయ.. ఏదీ లేకుండా హడావిడిగా సినిమా పట్టాలెక్కించేసి, వెనక్కి తిరిగి చూసుకున్నాక.. మొత్తం బ్లాంక్‌గా కనిపించేసరికి ఈ మార్పులు జరిగాయన్న ఇంకో వాదన కూడా విన్పిస్తోంది. 

అసలు కథ ఏంటి.? అంటే, ఏమో అది పవన్‌కళ్యాణ్‌కి, ఎస్‌జె సూర్యకి మాత్రమే తెలియాలి. ఎస్‌జె సూర్య సంగతెలా వున్నా, మొత్తం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఇవన్నీ ఈ ఎపిసోడ్‌కి సంబంధించినంతవరకు పవన్‌కళ్యాణ్‌వే గనుక, ఆయన దగ్గరే అసలు 'రహస్యం' అలా వుండిపోయిందేమో.! 

ఈలోగా మీడియాలో ఒకటే చర్చ, 'గోపాల గోపాల' సినిమా టైమ్‌లో డాలీకి మాటిచ్చాడు.. ఆ మాటని పవన్‌ నిలబెట్టుకున్నాడని. దీన్ని మాట నిలబెట్టుకోవడం అంటారా.? అలాగైతే, ఎస్‌జె సూర్యతోనే పవన్‌ సినిమా చెయ్యాలి కదా.! ఎస్‌జె సూర్య కాదనుకుని వెళ్ళిపోయాడు గనుక, పవన్‌ పిలిచి మరీ డాలీకి ఛాన్సిచ్చాడు.. అందుకే పవర్‌స్టార్‌ సూపర్‌ గ్రేట్‌.. అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

ఎప్పుడో ముహూర్తం కోసం లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. త్వరలోనే పట్టాలెక్కుతుందట. ఈలోగా ఇంత గందరగోళం.. విపరీతమైన పబ్లిసిటీ. పవన్‌కళ్యాణ్‌ సినిమాకి ఇదంతా అవసరమా.? ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంటే అయితే, బహుశా తెలుగు సినీ పరిశ్రమలో ఇంతకన్నా చీప్‌ పబ్లిసిటీ స్ట్రాటజీ ఇంకొకటి వుండదేమో.!

Show comments