కేసీఆర్‌.. ఏ బ్యాంకులో 20వేలు ఇస్తున్నరు.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దేశంలో మేధావులంతా క్యాష్‌లెస్‌ బాట పట్టాలనీ, పెద్ద పాత నోట్ల రద్దుతో చిన్న చిన్న ఇబ్బందులున్నాయే తప్ప, పెద్ద పెద్ద ప్రమాదాలేవీ జరగడంలేదని స్పష్టం చేసేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్‌, ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఢిల్లీకి వెళ్ళేందుకు నేను కూడా 20 వేల రూపాయలు డ్రా చేశాను..' అన్నారు కేసీఆర్‌. 

పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్రానికి వివరించామనీ, భవిష్యత్తు బాగుంటుంది గనుక, చిన్న చిన్న సమస్యల్ని అధిగమించక తప్పదనీ, ప్రజలు అర్థం చేసుకోవాలనీ కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. అయితే, మిత్రపక్షం మజ్లిస్‌ మాత్రం, పెద్ద పాత నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ సైతం, పెద్ద పాత నోట్ల రద్దుపై ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించింది. మరోపక్క, టీడీపీ, బీజేపీ పెద్ద పాత నోట్ల రద్దుని సమర్ధించుకున్నాయి. 

అంతా బాగానే వుందిగానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి 24 వేలు అడగ్గానే 'డ్రా చేసుకోవడానికి' ఏ బ్యాంకు అవకాశమిచ్చిందట.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత, బ్యాంకుల్లో డబ్బుని విత్‌ డ్రా చేసుకోవడం సామాన్యులకి గగనంగా మారిపోయింది. వారానికి 20 వేల రూపాయల పరిమితిని మొదట్లో కేంద్రం విధించినా, ఆ పరిమితికి తగ్గట్టుగా కూడా సొమ్ములు చెల్లించని దుస్థితి. అప్పుడేం ఖర్మ, రోజుకి 24 వేలు డ్రా చేసుకోవచ్చని ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ ఆ మొత్తం బ్యాంకులు ప్రజలకు ఇవ్వడంలేదాయె. 

కొన్ని బ్యాంకుల్లో కేవలం 2 వేల రూపాయలతో సరిపెడుతోంటే, ఇంకొన్ని బ్యాంకులు 4 వేల రూపాయలే ఇస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు 6 వేల రూపాయలదాకా ఇస్తున్నా, అవి చాలా చాలా తక్కువ. మొత్తమ్మీద, 10వేల రూపాయలు బ్యాంకు నుంచి డ్రా చెయ్యడం అంటే, గడచిన 40 రోజుల్లో అది అసాధ్యమైన పనిగానే మారిపోయిందన్నది జగమెరిగిన సత్యం. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కదా, అడిగితే 20 వేలు ఏం ఖర్మ, ఇంకా ఎక్కువే బ్యాంకులు ఇచ్చి తీరాలి. అంతటి వెసులుబాటు సామాన్యుడికి లేదు మరి.! అందుకే, సామాన్యుడి వెతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తెలిసే అవకాశమే లేదు.

Show comments