ప్యాకేజీ: జాతి మీడియా వర్సెస్ జాతీయ మీడియా!

మామూలుగానా… మమూలు హడావుడి చేసిందా తెలుగు దేశం జాతి మీడియా! ఇదిగో ప్యాకేజీ.. అది కూడా భారీ భారీ ప్యాకేజీ! లక్షన్నర కోట్లు.. వచ్చేస్తున్నాయి. మరి కాసేపట్లోనే ప్రకటన! అడిగో అరుణ్ జైట్లీ సర్దుకుంటున్నాడు, బట్టలేసుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు మీడియా ముందుకు!

మొత్తం లక్షన్నర కోట్లు… ఏపీకి  బంపర్ ప్యాక్! ఈ లక్షన్నర కోట్లలో పోలవరం వాటా 28 వేల కోట్లు, వెనుకబడిన జిల్లాల వాటా రెండు వేల కోట్లు.. విద్యా రంగానికి ఐదు వేల కోట్లు…. ఇలా సాగాయి జాతిమీడియాలో నిన్నటి వార్తలు! పగిలిపోయే వార్త.. పేలిపోయే వార్తలు.. అంటూ తమకు తోచిన ప్రాసలతో పచ్చ మీడియా చానళ్లు బుధవారం ఉదయం నుంచి ఒక్కటే హడావుడి చేశాయి! 

ఒక సారి కాదు.. కొన్ని వందల సార్లు బ్రేకింగ్ న్యూసులు వేసి ఉంటాయి పచ్చ జాతి చానళ్లన్నీ. తమ స్థాయి పైత్యాన్ని జనాలపై రుద్దుతూ అంతా అయిపోయిందని, లక్షన్నర కోట్లని అందులో ఏ రంగానికి ఎన్ని వందల, వేల కోట్లో కూడా ఈ పచ్చమీడియా జర్నలిస్టులే డిసైడ్ చేసి బ్రేకింగ్ న్యూస్ లు వేసుకున్నారు!

కానీ.. ఇంగితం ఉన్న వారికి ఎవరికైనా వచ్చిన సందేహం ఏమిటంటే.. లక్షన్నర కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తున్నారంటే అది కేవలం ఏపీలోని పచ్చజాతి మీడియాకు మాత్రం సంబంధించిన విశేషం అవుతుందా? అనేది! జాతీయ మీడియా అంటూ ఒకటి ఏడ్చింది. ఏపీకి అన్యాయం జరుగుతున్న వేళ కాకపోయినా.. ఇలాంటి ప్యాకేజీ అంటూ ఒకటి ప్రకటిస్తున్న వేళ అయినా అది నిద్ర లేస్తుంది. కనీసం కేంద్ర ప్రభుత్వం అయినా దాన్ని నిద్రలేపుతుంది! Readmore!

బిహార్ కు ప్యాకేజీ అని మోడీ నోటి మాట ఒకటి అనేస్తే ఎంత అలజడి రేగింది? దాని గురించి దేశమంతా ఎన్ని రోజులు మాట్లాడుకుంది? మరి ఏపీ కి నిజంగానే భారీ ప్యాకేజీ ప్రకటించేటట్టు అయితే.. దానిపై ఢిల్లీలో హడావుడి ఉండదా? 

అయితే ఏనాడో వలవలు విప్పేసిన తెలుగుదేశం జాతి మీడియాకు ఇలాంటివన్నీ ఒక లెక్కకాదు! బుధవారం ఉదయం నుంచి రాత్రి పదిగంటల వరకూ పాడిందే పాడి.. చివరకు జనాలనూ ఉసూరుమనిపించింది పచ్చ మీడియా వర్గం. 

ఎంత దారుణం అంటే.. ప్యాకేజీ ఏమిటి ప్యాకేజీ? ఏపీకి హామీ ఇచ్చింది ప్రత్యేక హోదా కదా.. దాని గురించి మాట్లాడకుండా కేంద్రం ప్యాకేజీ అంటుందేమిటి? అని ప్రశ్నించాల్సిన మీడియా, ఆఖరికి పోలవరానికి  28 వేల కోట్లు.. అది కూడా ప్యాకేజీలో భాగం అంటూ వార్తలు ప్రసారం చేస్తూ పండగ చేయడం అంటే తెలుగు వాళ్ల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాక మరేమిటి? పోలవరాన్ని జాతీయ  ప్రాజెక్టుగా స్వీకరించి, పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిది అని విభజన చట్టంలో పేర్కొన్నారు. మరి దానికి అయ్యే ఖర్చుకు కూడా “ప్యాకేజీ’’ కలరిచ్చి పచ్చమీడియా తెలుగు ప్రజలను మోసం చేయడానికి పూనుకోవడం నిజంగా హేయం!

మరి నిజంగా ప్యాకేజీ వస్తే.. దాంట్లో ఈ మీడియా యజమానుల వాటాకు ఎంత దక్కుతుందో కానీ.. ప్రజలను మోసం చేయడంలో , పక్కదారి పట్టించడంలో రాజకీయ పార్టీ లను మించిపోయి ప్రవర్తిస్తున్నాయి ఈ మీడియా వర్గాలు. వీటిని అర్థం చేసుకోకుంటే.. ఆ నష్టం సీమాంధ్రులు జీవిత కాలం అనుభవిస్తారు!

Show comments