'బస్సు ప్రమాదం దురదృష్టకరం..' ఇదీ టీడీపీ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తమకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురవడం, ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడటంపై స్పందించిన తీరు. జేసీ బ్రదర్స్ నిర్వహిస్తోన్న దివాకర్ ట్రావెల్స్‌కి చెందిన బస్సులు ప్రమాదాల బారిన పడటం ఇదే కొత్త కాదు. చాలా ప్రమాదాల్లో ఇదీ ఒకటి.!
ఎంతైనా, అధికార పార్టీకి చెందిన నేత తాలూకు 'ట్రావెల్స్ బస్సు' కదా, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుతిమెత్తగా స్పందించింది. రోడ్డు డిజైన్ లోపాలేమైనా వున్నాయా.? అన్న కోణంలో విచారణ జరుపుతారట.. ఇది డీజీపీగారి మాట. ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణీకుల ప్రాణాల్ని ఎలా తీసేస్తున్నాయో ఇటీవలి కాలంలో చాలా సంఘటనలు నిరూపించాయి. 'ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాల్ని అడ్డుకుంటాం.. వారి ఆటలు సాగనివ్వం..' అంటూ ప్రభుత్వాలు చెప్పడమూ మామూలే, ప్రైవేటు ట్రావెల్స్ ఆటలు, ఆగడాలు కొనసాగుతుండడమూ మామూలే.
ఇదే ప్రమాదం ఇంకో బస్సుకి జరిగి వుంటే, టీడీపీ నేతలే రోడ్డెక్కి ఆందోళనలు చేసి వుండేవారు. ట్రావెల్స్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసేవారే. కానీ, ఇక్కడ బస్సులు జేసీ దివాకర్‌రెడ్డికి చెందినవి కదా.. అందుకే అంతా కామప్. ఓ ఎంపీ అయి వుండీ, తన ట్రావెల్స్ కారణంగా 11 మంది చనిపోతే, 'దురదృష్టకరం..' అనే స్టేట్‌మెంట్ ఇచ్చేసి చేతులు దులుపుకోవడాన్ని ఏమనాలి.? బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట ఇది.