రెడ్డిగారి గోల.. సీమ బద్దలైపోవాలా.?

రాయలసీమని రెండుగా చీల్చేయాలని పాపం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి, 'కర్నూలు, అనంతపురం జిల్లాల్ని తెలంగాణలో కలిపెయ్యాలి..' అంటూ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన విషయం విదితమే. మొత్తం రాయలసీమని తెలంగాణలో కలిపేయాలని కూడా కామెడీ చేశారాయన. కానీ, జేసీ దివాకర్‌రెడ్డి 'గోల'ని ఎవరూ పట్టించుకోలేదు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా, జేసీ దివాకర్‌రెడ్డి 'ఆశ' చావలేదేమో.! ఇంకా, ఆయన తెలంగాణ రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసిపోతే బావుండునని కోరుకుంటున్నారు. ఇదంతా 'అర్థ' సీమ.. అదేనండీ, కర్నూలు - అనంతపురం జిల్లాల మీద ప్రేమేనా.? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ని అడ్డగోలుగా విభజించేస్తోందని తెలిసీ, మంత్రి పదవిని పట్టుకుని వేలాడిన ఘనుడాయన. అంతెందుకు, ఆ విభజనకు సహకరించిన టీడీపీతో అంటకాగారు జేసీ దివాకర్‌రెడ్డి. నిజంగా, జేసీ దివాకర్‌రెడ్డికి కర్నూలు, అనంతపురం జిల్లాలపై అంత ప్రేమ వుండి వుంటే, ఆ రెండు జిల్లాలూ తెలంగాణలో కలవాలని కోరుకుంటే, టీఆర్‌ఎస్‌లో చేరిపోయి, ఆ పార్టీ గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేసేవారే. 

అయ్యిందేదో అయిపోయింది.. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లో, అందునా రాయలసీమలో 'విభజన' బీజాల్ని జేసీ దివాకర్‌రెడ్డి ఎందుకు నాటాలనుకుంటున్నారు.? ఈ రెండు జిల్లాలూ రాయలసీమలో అత్యంత వెనుకబడి వున్నాయన్నది నిర్వివాదాంశం. కడప, చిత్తూరు జిల్లాల పరిస్థితీ అంతే. ఆంధ్రప్రదేశ్‌లో అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ బాగా వెనకబడ్డాయి. ప్రకాశం జిల్లా సంగతి సరే సరి. వెనుకబాటుతనం లెక్కలు తీస్తే, మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల పరిస్థితీ విభజన తర్వాత దారుణంగా తయారైందని చెప్పొచ్చు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో సీమలో, అందునా కడప - చిత్తూరు జిల్లాలు ఓ వైపు, కర్నూలు - అనంతపురం జిల్లాలు ఇంకో వైపు (తెలంగాణ వైపు) అన్నట్లుగా జేసీ దివాకర్‌రెడ్డి తెరపైకి తెస్తున్న విభజన వాదం రానున్న రోజల్లో ఎలాంటి రాజకీయ రచ్చకు కారణమవుతుందోగానీ, ఈ వివాదం పేరు చెప్పి నాయకుడిగా ఎదగాలనుకుంటున్న జేసీ దివాకర్‌రెడ్డి ప్రస్తుతానికైతే నవ్వులపాలైపోతున్నారన్నది నిర్వివాదాంశం.

Show comments