లే పంగా.. దుమ్ము లేపంగా.!

ప్రో కబడ్డీ.. వచ్చాక కబడ్డీ ఆటపై అనుమానాలు తొలగిపోయాయి. క్రికెట్‌ విదేశీ ఆట. కానీ, దాని పట్ల మనకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. క్రికెట్‌కి దేశంలో వున్న పాపులారిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా స్టార్లు, పొలిటీషియన్లని మించిపోయింది క్రికెటర్ల పాపులారిటీ. క్రికెట్‌ అంటే విపరీతమైన ఫాలోయింగ్‌ గేమ్‌ మాత్రమే కాదు, అదో జూదం. పేరుకి క్రికెట్‌ జెంటిల్‌మెన్‌ గేమ్‌ అయినా, ఆ క్రికెట్‌ ముసుగులో జరుగుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పుణ్యమా అని క్రికెట్‌ అంటే అసహ్యం ఏర్పడింది చాలామందికి. కానీ, ఏం చేస్తాం.? క్రికెట్‌లా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చే ఆట ఇంకోటి దేశంలో లేదు. 

కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు దేశమంతా 'లే పంగా..' అంటోంది. ప్రో కబడ్డీతో చిన్నా, పెద్దా ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. సినీ ప్రముఖులు 'లే పంగా..' అంటూ ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు. లైవ్‌ ప్రసారాలతో 'కబడ్డీ..' ఇంటింటికీ చేరువైపోయింది. కాలనీల్లో ఒకప్పుడు క్రికెట్‌ ఆడుతూ చిన్నారులు కన్పించేవారు. ఇప్పుడు కబడ్డీ ఆడేవారూ కన్పిస్తున్నారు. కబడ్డీ, మన సంస్కృతీ సంప్రదాయాల్లో భాగం. అది ఆట మాత్రమే కాదంటారు కబడ్డీ ప్రేమికులు. 

ప్రస్తుతానికైతే ఐపీఎల్‌ తరహాలో కబడ్డీ, భారత కబడ్డీ అభిమానుల్ని అలరిస్తోంది. సెషన్‌ సెషన్‌కీ అభిమానుల్ని పెంచుకుంటూ పోతోన్న ప్రో కబడ్డీ, ముందు ముందు దేవంలో మోస్ట్‌ పాపులర్‌ 'ఆట'గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన తెలుగు జట్టు తరఫున టాలీవుడ్‌ నటుడు రాణా, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రో కబడ్డీలో హంగామా చేస్తోన్న విషయం విదితమే. ఈ హంగామాకి సన్నీలియోన్‌ కూడా జాయిన్‌ కానుంది.

Show comments