డైరీ ఆఫ్‌ డీడీ : కోడెల వారి కొరడా కామెడీ!

చేత బెత్తమున్ను, పచ్చటి కండువా 

సస్పెన్షను కొరడా చేతబట్టి 

'సిడౌను ప్లీజు'లు, మైకుకు 'సారీ'లు 

కోడెలయ్యా నీకు సాటిలేరు! 

... ఆహా! ఈ నడుమ నాలోని కవిపుంగవుడు మెచ్యూర్‌ అయిపోవుచున్నాడని బహు అనుమానముగా ఉన్నది. వాస్తవముగా రహస్యముగా మాట్లాడుకొనునట్లయితే ఈ మెచ్యూరిటీతో చాలా ప్రాబ్లముంలుండును. ఒకసారి మెచ్యూరు అయితే.. ఎవ్రీ మంత్‌ మూడు రోజులు నానాయాతన ఉండునని మహిళలు మాట్లాడుకొనుచుండుగా ఓసారి గోడచాటునుంచి వినుట తటస్థించినది. అయినా మనము మెచ్యూర్‌ కావలనే గానీ.. యాతనకు కష్టములకు జడియు వారము కాము. 

సరే నా మెచ్యురిటీ సంగతి విడిచి డైరీలోకి వస్తాను. కవిపుంగవుడు విజృంభించి రాసేస్తున్నాడు. కాకపోతే కవిత్వానికి ప్రేరణ కావాలి. యుక్తవయస్సులో కవులకు టైట్స్‌ వేసుకున్న అమ్మాయిలు, లోనెక్‌ అలవాటున్న పొరుగింటి మహిళలు ఇలాంటి ప్రేరణ ఇచ్చుట కద్దు. కానీ అదంతా ప్రేమ, శృంగారాత్మక కవిత్వము. కానీ నేను యుక్తవయస్కుడినే అయినప్పటికీ.. నాలో సామాజిక కోణము మెండు. నా కవిత్వములో కూడా సామాజికాత్మకత పొంగి పొరలవలెను. అప్పుడప్పుడూ కోడెల వంటి వారు నాకు ప్రేరణ ఇత్తుతుండరు. పైన గమనించినచో చిన్నప్పుడు నేర్చుకున్న 'చేత వెన్నముద్ద...'కు ఎంత చక్కటి పేరడీ వ్రాసితినో గమనించవచ్చును. 

కోడెల వారు మంచి కామెడీ ఎపిసోడ్‌ను నడిపించిరి. వైకాపా ఎమ్మెల్యేల గురించి పితూరీ వచ్చిన తక్షణం స్పందించి, మూడునెలల తర్వాత దానిని బుట్ట దాఖలు చేసిరి. అయిననూ ఆయనను నిందించుట సరికాదు. తొలుతే సాంకేతిక కారణములనే ఇబ్బంది తలెత్తకుండా.. చక్కటి పితూరీని బనాయించలేని అసమర్థులు ఉండుట వైకాపా పార్టీలోని జగన్‌ బృందము లోపముగా చెప్పవచ్చును. కనీసం పితూరీలు కూడా అచ్చముగా పెట్టగల అనుభవము లేని జట్టుకు నాయకుడు గనుకనే.. జగను గురించి చంద్రబాబునాయుడు పదేపదే రాజకీయ పిలకాయగా అభివర్ణించుచుండును. సభాపతిగా ఆయన నిత్యము కొరడా ధరించి ఉండును.. ఆయన మాటకు ఎవరు ఎదురు చెప్పిననూ సస్పెండు అని కొరడా విదుల్చుచుండును. 

అందుకే కాబోలు ఈ పిలకాయ మనల్ని ఏమీ చేయలేడను ధీమాతోనే కోడెల వారి పితూరీలను బుట్టదాఖలు చేసెను. కోడెల వారు చాలా గొప్ప పదవిలో ఉన్నారు. సభ్యుల ఫిరాయింపు గురించి పితూరీ అందినచో.. వారు ఎన్ని సంవత్సరములలోపల స్పందించి దాని మీద నిర్ణయము తీసుకొనవలెనని నిర్దేశించే నియమము ఏమియునూ భారత రాజ్యాంగములో లేదనుట స్పష్టము. ఆ సంగతి తెలియక పోవుట వైకాపా వారి అజ్ఞానము అనుకొనవలెను. తమలోని అజ్ఞానమును గురించి జ్ఞానము కలిగిఉండకుండా.. కోడెల వారి మీద రాజ్యాంగ విరుద్ధమైన నిందలు వేయుచూ.. ఆయన సత్వరమే నిర్ణయము తీసుకొనవలెనని ఆక్రోశించుట, న్యాయం కొరకు అభిలషించుట ధర్మసమ్మతము అని కొందరు అజ్ఞానులకు అనిపించవచ్చునేమో గానీ.. అది రాజ్యాంగ విరుద్ధము అని వారు తెలుసుకొనవలెను. 

భగవంతుడా.. ఇవాళ వారికి ఆపాటి జ్ఞానమును ప్రసాదించుము. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడిన వెంటనే నీకు కోటి కొబ్బరికాయలు కొట్టించి మొక్కు చెల్లింతును. (దేవుడా.. నీవు విన్నది నిజమే. అక్షరాలా కోటి కొబ్బరికాయలే కొట్టింతును. వ్వెవ్వెవ్వె.. ఇలాంటి కార్యము జరుగుట అసాధ్యము... కనుకనే ధైర్యముగా మొక్కితిని!) 
-దారినపోయే దానయ్య

జ్యేష్ట బహుళ అమావాస్త దుర్ముఖి  అనగా 4 జులై 2016

Show comments