సినిమా థియేటర్లలో జనగనమన.. అద్భుతః

సినిమా థియేటర్‌కి వెళుతున్నారా.? క్యాన్సర్‌పై అవేర్‌నెస్‌ కోసం యాడ్స్‌ అక్కడ కనిపిస్తాయి.. అంతేనా, సవాలక్ష కమర్షియల్‌ యాడ్స్‌ కూడా తప్పవు. ఇకపై, వీటితోపాటు దేశభక్తి ఉప్పొందేలా జాతీయ గీతాలాపన కూడా వుంటుంది. మిగతావాటన్నిటి సంగతి ఎలా వున్నాసరే, జాతీయ గీతం తప్పనిసరి. ఆ సమయంలో, తెరపై జాతీయ జెండా రెపరెపలాడాల్సిందే. జాతీయ గీతాలాపన జరుగుతున్న సమయంలో, ప్రేక్షకులు లేచి నిలబడాలి.. జాతీయ గీతాన్ని ఆలపించాలి. 

సుప్రీంకోర్టు తాజా నిర్ణయం పట్ల దేశశ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు దేశ ప్రజలు. దేశభక్తి విషయంలో 'బలవంతంగా రుద్దకూడదు' అన్న మాటకు తావే లేదు. రుద్ది తీరాల్సిందే. దేశాన్ని ప్రేమించలేనివాడు, అసలు దేశంలో జీవించడానికే వీల్లేదు మరి.! 'జనగనమన..' అంటూ సాగే జాతీయ గీతంపైనా వివాదాలున్నాయి. వివాదాలకేం, ప్రజాస్వామ్య దేశం కదా, దేని చుట్టూ అయినాసరే, వివాదాన్ని సృష్టించేయగలం. ఇకపై, అలాంటివి కుదరవు. 

జాతీయ గీతాన్ని కమర్షియల్‌ యాడ్స్‌లో వినియోగించడం కూడా ఇకపై నేరంగా పరిగణిస్తారు. జాతీయ గీతంలో కొంత భాగం లేదా పూర్తిగానో, కమర్షియల్‌ యాడ్స్‌లో వినియోగిస్తే అంతే సంగతులు. ఎట్టి పరిస్థితుల్లో జాతీయ గీతానికిగానీ, జాతీయ జెండాకిగానీ అవమానం జరగకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దాంతో, సోషల్‌ మీడియాలో అయినా ఇంకెక్కడైనా జాతీయ గీతంపైనా, జాతీయ జెండాపైనా వెకిలి చేష్టలకు తగిన మూల్యం చెల్లించాల్సిందే.

అంతా బాగానే వుందిగానీ, సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల్ని ఏ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించగలుగుతాయి.? థియేటర్ యాజమాన్యాలు ఈ విషయంలో ఎంత దేశభక్తిని ప్రదర్శించగలుగుతాయి.. అన్నిటికీ మించి, థియేటర్లలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో వీక్షకులు దాన్ని భక్తి భావంతో స్వీకరిస్తారు.. ఇవన్నీ ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నలే. కానీ, సుప్రీంకోర్టు తీర్పు అమలయి తీరాల్సిందే. దానికి ప్రతి భారతీయుడూ బాధ్యత వహించాల్సిందే.

Show comments