విజయ్‌ మాల్యా.. ఏంటా ధీమా.?

లిక్కర్‌ కింగ్‌, 9 వేల కోట్ల మాయగాడు.. విజయ్‌మాల్యా, అరెస్టయినా ఇంకా అదే 'పొగరు' ప్రదర్శిస్తున్నాడు. భారతీయ మీడియా అతి చేస్తోందంటూ అరెస్టయి, బెయిల్‌ వచ్చిన కాస్సేపట్లోనే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాడు. అరెస్టవడమంటే అది చాలా చాలా చిన్న విషయంగా విజయ్‌ మాల్యా భావిస్తున్నాడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అక్కడికేదో, అసలు అరెస్టే కాలేదన్నట్టుంది విజయ్‌ మాల్యా వ్యవహారం. 

ఒకవేళ, భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి, విజయ్‌ మాల్యాని అతి త్వరలో ఇండియాకి తీసుకొచ్చినా, అరెస్టు చేసి జైల్లో పెట్టినా.. 'జైలంటే అత్తగారి ఇల్లు' అన్నట్టు భావిస్తాడేమో.! ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు.. ఆయనలాగే ఫీలవుతాడు. అఫ్‌కోర్స్‌, భారతదేశంలో చట్టాలు, కేవలం డబ్బున్నోళ్ళకి చుట్టాలుగా మాత్రమే మారిపోతున్నాయి. దేశంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఎంతమంది 'పెద్దలు' జైలుకెళ్ళారు.. వారిలో ఎంతమంది జైల్లోనే రాజభోగాలు అనుభవించారు.? ఆ తర్వాత నిర్దోషులుగా ఎంతమంది బయటకొచ్చారు.? ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే, విజయ్‌ మాల్యా వెనుక ధీమా ఏంటో సుస్పస్టంగా అర్థమవుతుంది. 

ఇదిలా వుంటే, విజయ్‌ మాల్యాని ఇండియాకి తీసుకురావడం అసాధ్యం కాకపోయినా, చాలా కష్టమైన ప్రక్రియ అన్నది నిపుణుల వాదన. ఒకవేళ తీసుకొచ్చినా, అప్పులు తీర్చేస్తానంటున్నాడు గనుక, దానికి న్యాయస్థానాలు సానుకూలంగా స్పందించే అవకాశాల్లేకపోలేదు. సహారా కుంభకోణంలో మాత్రం ఆ తరహాలో పప్పులుడకని దరిమిలా, పరిస్థితులు వుంటాయో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నది ఇంకొందరి అభిప్రాయం. 

మొత్తమ్మీద, విజయ్‌ మాల్యా చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. ఎందుకు వుండడు.. మందిని మోసం చేసి సంపాదించిన సంపాదన కదా.. దాంతో చేస్తున్న జల్సాలు కదా.. ఆ మాత్రం ధీమా, ధైర్యం, తెగువ, పొగరు.. అన్నీ వుంటాయ్‌. అవే ఆయన చూపిస్తున్నాడు. పైగా, మీడియా అంటే ఆయనకి మహా చులకన. దానికీ ఓ కారణం వుంది. జాతీయ స్థాయిలో దాదాపుగా అన్ని మీడియా సంస్థలతోనూ ఒకప్పుడు ఓ ఆట ఆడుకున్నాడాయన. అందర్నీ డబ్బుతోనే కొట్టేశాడు. మీడియా ఏంటి, హీరోయిన్లు ఏంటి, రాజకీయ నాయకులేంటి.? అందర్నీ డబ్బుతోనే కొట్టాడు. ఈ విషయంలో విజయ్‌ మాల్యాని మించినోడు దేశంలోనే లేడనడం అతిశయోక్తి కాకపోవచ్చు.

Show comments