చినబాబు ప్లాన్ కు ఎమ్మెల్యే విలవిల?

విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో బాబు స్టయిల్ రాజకీయం నడుస్తోంది. బాబుకు ఎప్పటికైనా సమస్య కావచ్చు..పార్టీ మారొచ్చు..లేదా పార్టీలోకి వచ్చే జనాలకు అడ్డం కావచ్చు..అనే ఎమ్మెల్యేలపై ఫైళ్లు తయారుచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ వీడి వెళ్లి, ప్రజారాజ్యం..కాంగ్రెస్ ల మీదుగా మళ్లీ పార్టీలోకి వచ్చారు. 

ఆయన 2019నాటికి మళ్లీ మరో పార్టీని చూసుకుంటారన్న టాక్ వుంది. అయితే ఈ ప్రచారానికి విరుగుడుగా, తన వంతు వివరణగా గంటా బాబు అనుకూల మీడియా ద్వారా ఇంటర్వూలు ప్రసారం చేసించి, సర్దుబాటు కార్యక్రమం చేపట్టే పని చేసారు కానీ అది అంతగా ఫలితాలు ఇవ్వలేదు.  గంటా తెలుగుదేశం పార్టీలోకి ఒంటరిగా రాలేదు. ఆయనతో వచ్చిన వారు ప్యాకేజీ కింద ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. 

అందువల్ల భవిష్యత్ లో గంటా మళ్లీ ఈ విధంగా ప్యాకేజీ కిందే వెళ్లిపోతే..? ఆ మధ్య కొణతాల రామకృష్ణ పార్టీలోకి వస్తాను అంటే గంటా, అండ్ ఈ అనుచరులు అడ్డం పడ్డారు. నిజానికి అధిష్టానానికి కొణతాలను పార్టీలోకి తీసుకోవాలని వుంది. కానీ ఇంతమంది అడ్డం పడడంతో వెనక్కు తగ్గింది. అప్పటి నుంచి గంటాపై పార్టీ వ్యవహారాలు చూస్తున్న లోకేష్ కన్ను పడింది.గంటా వెనుక బలంగా ఎవరు వున్నారు? రేపు తప్పకపోతే గంటా వెనుక ఎవరు వెళ్తారు..వారి వ్యవహారలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

'దాడి' కూడా..

ఇదిలా వుంటే దాడి వీరభ్రద్ర రావు మరోసారి తేదేపాలోకి రావాలనుకుంటున్నారు. కానీ పార్టీ అందుకు ఓకె అనడం లేదు. గతంలో నెంబర్ టూ రేంజ్ లో ప్రొజెక్ట్ చేస్తే, పార్టీ వదిలి వెళ్లారన్నది అందుకు కారణం. దీంతో దాడి తన రాజకీయానికి పదును పెట్టారు. అనకాపల్లి నియోజకవర్గంలో తన అవసరం పార్టీకి కనిపించేలా చేయాలన్నది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది. అదేసమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోవింద్..కొణతాల రామకృష్ణ సోదరుడు వియ్యం అందారు. అంటే ఇద్దరు బలమైన నాయకులు ఒక్కటయ్యే అవకాశం కనిపించింది.  దీంతో గోవింద్ ను రాజకీయంగా అన్ పాపులర్ చేసే పని ప్రారంభమయ్యింది.

సామాజికవర్గం కూడా..

దీనికి తోడు తెలుగుదేశం పార్టీ పునాదులున్న సామాజిక వర్గానికి అనకాపల్లి ప్రాంతంలో ఎక్కువగా క్వారీ వ్యాపారాలు వున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ కూడా. వీరందరికీ లోకల్ ఎమ్మెల్యే పీలా గోవింద్ దందాల వైఖరి ఇబ్బందిగా వుంది. తమ సామాజిక వర్గ ప్రయోజనాలు కాపాడే పార్టీ ఎమ్మెల్యే అయి వుండి, తమ మీద పెత్తనం చేయడం ఏమిటి? అన్నది వారి ఆగ్రహానికి కారణం. ఈ పంచాయతీ లోకేష్ దాకా వెళ్లినట్లు..దానిపై ఎమ్మెల్యేను పిలిచి, ఆయన క్లాసు పీకినట్లు బోగట్టా.
మీడియా రంగ ప్రవేశం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు..అందునా బాబు సామాజికవర్గ ఎమ్మెల్యేల్లో కొంత మంది ఏ విధమైన దందాలు నడుపుతున్నారో..ఏ విధమైన అక్రమార్జన సాగిస్తున్నారో తెలియంది కాదు. ఆ మాటకు వస్తే ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు ఏదో విధమైన ఆర్జన లేకుండా లేరు. కానీ బాబు అనుకూల మీడియా చాలా వరకు తమ తమ వర్గ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వీటిని వేరు వేరుగా చూడడం అలవాటు చేసుకుంది. ఇప్పుడు అనకాపల్లి ఎమ్మెల్యే విషయంలో తమ వర్గ జనాలకు ఇబ్బందులు తలెత్తడం, పైగా గంటా వెనుక వున్నవారిని ఓ కంట కనిపెట్టాలనే బాబు ప్లాన్ లో భాగస్వామ్యం వుండడంతో అనకాపల్లి ఎమ్మెల్యే మీద కథనాలు ప్రారంభమైపోయాయి. 

ఒక్కసారిగా దేశం అనుకూల మీడియాకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం..మీడియా బాధ్యతలు గుర్తుకు వచ్చి, కథనాలు ప్రారంభమైపోయాయి. మంచిదే. అవినీతి ఎక్కడున్నా, తప్పు ఎక్కడున్నా ఎత్త చూపాల్సిందే. కానీ మొత్తం పదమూడు జిల్లాల్లో ఇటు వంటి పరిస్థితే వుంది. మరి అక్కడ ఎందుకు దృష్టి సారించడం లేదో..ఇక్కడెందుకు ఇంత నికార్సుగా కర్తవ్య పరాయణం పాటిస్తున్నారో అంటే..వెనుక బాబుగారి ప్రయోజనాలు వుండడం తప్ప వేరు కాదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంత జరిగిన తరువాత, అవినీతి పైలు పేరుకున్నాక..మళ్లీ టికెట్ వస్తుందా? లేదా పార్టీ మారితే ఈ అవినీతి బురద అంతా రెడీగా వుండదా.. జల్లేయడానికి. 

Show comments