265 ప్లస్.. సీట్లే లక్ష్యం అని అంటోంది భాజపా. 400 అసెంబ్లీ సీట్లున్న యూపీలో 265 పై రేంజ్ లో సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ యూపీలో సృష్టించిన సునామీని దృష్టిలో ఉంచుకుంటే.. బీజేపీ చాలా తక్కువ సీట్లనే టార్గెట్ గా పెట్టుకుంది. ఇక్కడ 90 శాతం ఎంపీ సీట్లలో పాగా వేసిన బీజేపీ .. అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ అదే టార్గెట్ గా పెట్టుకోవాల్సింది!
అప్పుడూ కమలం గుర్తూ.. ఇప్పుడూ కమలం గుర్తూ.. అప్పుడూ మోడీనే, ఇప్పుడూ మోడీనే! యూపీలో సీఎం అభ్యర్థి లేకుండానే బరిలోకి దిగుతున్న బీజేపీ లోక్ సభ ఎన్నికల నాడు సాధించిన స్థాయిలో సీట్లను సాధిస్తేనే.. మోడీ హవా కొనసాగుతున్నట్టు!
360 సీట్లను లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగాల్సిన బీజేపీ కనీసం 265 సీట్లు సాధిస్తే చాలని అనుకుంటోంది. మరి దీన్ని సాధించడానికి ఇప్పుడు ముస్లిం లపై.. అందునా ముస్లిం మహిళలపై స్వయంగా నరేంద్రమోడీ అపారమైన ప్రేమను ఒలకబోస్తున్నాడు. తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయాల్సిందే అని అంటున్నాడు.
మరి ముస్లింలపై అపారమైన ప్రేమను ఒలకబోయడం.. అందునా.. యూపీలో ఎన్నికల లక్ష్యంగా జరుగుతున్న సభల్లో ఆయన ఇలా మాట్లాడుతుండటంలో అంతరార్థం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలో భారతీయులు లేరు. యూపీలో మత సమీకరణాల ఆధారంగా హిందువులను ఆకర్షించడంలో భాగంగా బీజేపీ తలాక్ సంప్రదాయాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఇస్లాం మతంలో సంస్కరణలు.. అనే విషయాన్ని పక్కన పెడితే, బీజేపీ యూపీ ఎన్నికల సమయంలో ఈ అస్త్రాన్ని వాడుతోంది. తద్వారా మత పరంగా విబేధాల స్థాయి ఎక్కువగా ఉండే యూపీలో ఈ విధంగా హిందువుల ఇగోను శాటిస్ ఫై చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎంతైనా కేంద్రంలో అధికారంలో ఉన్నారు.. ముస్లింలపై మోడీ స్థాయి వాళ్లు విధ్వేష పూరిత వ్యాఖ్యానాలు చేసి రాజకీయం చేస్తే.. తీవ్రమైన పరిణామాలు తలెత్తుతాయి. అందుకే.. పాము చావకుండా, కర్ర విరగకుండా.. తలాక్ వ్యవహారాన్ని బీజేపీ నెత్తికెత్తుకుంది!
మరోవైపు సుబ్రమణ్య స్వామి లాంటి వాళ్లు.. యథాతథంగా ‘రామమందిర’ రాజకీయం చేస్తున్నారు. హిందువులను అలా మరోసారి క్యాష్ చేసుకునే యత్నం జరుగుతోంది.
ప్రధాని అయిన దగ్గర నుంచి మోడీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఒకటీ, రెండు సార్లు అడుగుపెట్టడం కూడా జరగలేదు. అలాంటాయన గత ఏడాది కాలంలోనే 11 సార్లు యూపీలోని వివిధ ప్రాంతాలను సందర్శించాడు. సభలు, సమావేశాలు జరుపుతూనే ఉన్నారు. దీన్ని బట్టి.. యూపీ లో గెలుపును మోడీ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం అవుతోంది. మరి బీజేపీకి పూర్తి స్థాయిలో అండగా నిలిచిన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మోడీ పాలన మీద రెఫరండం లాంటివే. దాదాపు 18 కోట్ల మంది ఇచ్చే తీర్పులో మోడీ పాలనకు, ఆయన రాజకీయ వ్యూహాలకు ఎన్ని మార్కులు పడతాయో!