పవన్ కల్యాణ్ అన్నీ ఉత్తుత్తి మాటలు చెప్పారా? ఏదో సినిమాలకు హైప్ సృష్టించడానికి అవాకులు చెవాకులు, ఉన్నవీ లేనివీ అన్నీ కల్పించి ఆడియో ఫంక్షన్లలో చెప్పుకునే అలవాటును జనసేన రాజకీయ సభావేదిక మీద కూడా పవన్‌కల్యాణ్ ప్రదర్శించారా? ఆలస్యంగా అయినా అధికారిక వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అలాగే అనిపిస్తోంది.
పవన్ కాకినాడ సభలో జరిగిన ప్రమాదంలో ఓ అభిమాని దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చాలని తాను అనుకున్నానని, అయితే పోలీసులు తనను అందుకు అనుమతించలేదని పవన్ కల్యాణ్ సెలవిచ్చారు. సభా ముఖంగా ప్రకటించారు. మరురోజు మరణించిన అభిమాని కుటుంబానికి 5 లక్ష ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఆ సమయంలో కూడా స్వయంగా వెళ్లి ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవాలని ఉన్నప్పటికీ.. పోలీసులు తాము అక్కడ రద్దీని కంట్రోల్ చేయలేమంటూ.. తనను అనుమతించలేదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా ఉత్తుత్తిదేనట. రద్దీని కంట్రోల్ చేయడం తమకు చేతకాదని పోలీసులు చెప్పడం.. ఏమిటి ఆయనేదో.. జనం కోసం అలా చెబుతున్నారు... అని సాక్షాత్తూ జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియా మిత్రులతో చిట్‌చాట్‌గా చెప్పడం విశేషం.
పవన్ వస్తే ఏర్పాట్లు చేయడం మాకెందుకు చేతకాదు.. అంత చేతగాని వాళ్లలా ఉన్నామా? ఆయన సభకే ఏర్పాట్లు చేసిన వాళ్లం.. ఓ ఇంటికి వస్తే పోలీసులు ఏర్పాట్లు చేయరా? ఆయన తిరుపతి వెళ్తే అక్కడ పోలీసులు ఏర్పాటు చేయలేదా? అసలు ఆయన అభిమాని ఇంటికి వెళ్తానని, అందుకు ఏర్పాట్లు చేయగలరా? అని మమ్మల్ని అడగనే లేదు.. అని సదరు పోలీసు ఉన్నతాధికారి సెలవిచ్చారట.
పవన్ కల్యాణ్‌కు హైప్ బాగా అలవాటై పోయినట్లుంది. అన్ని డాంబికాల ప్రకటనలు అబద్ధాలు చెప్పడం ఎందుకు? ఏదో ప్రమాదం జరిగింది.. ఆ అభిమాని కుటుంబానికి 5 లక్షలు ఇస్తున్నా అని ప్రకటిస్తే సరిపోతుంది కదా.. అని జనం అనుకుంటున్నారు. తన అభిమాని మరొకరి వల్ల చనిపోతే మాత్రం (తిరుపతి దుర్ఘటన) ఆ ఇంటికి వెళ్లి ఆ తల్లి కన్నీళ్లు తుడవడానికి పవన్ కల్యాణ్ కు పోలీసులు భద్రత ఇవ్వగలరు. ఆయన వెళ్లగలరు. అదే ఒక అభిమాని తన కారణంగానే చనిపోతే మాత్రం.. (కాకినాడ దుర్ఘటన) పోలీసులు భద్రత ఇవ్వలేరని సాకు చెప్పి తప్పించుకోవడం ఘోరం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.