ప్రస్తుతానికి అమరావతి ఇంకా మిధ్యే. తాత్కాలిక సచివాలయం అందుబాటులోకి వస్తే, ఆ మిధ్య నుంచి కాస్త ఉపశమనం. ప్రత్యక్షంగా అమరావతిలో ఓ భవన సముదాయం కన్పించనుంది.. అదీ అధికారిక సముదాయం. జూన్ 29వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయి.? అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
ప్రస్తుతానికైతే ఓ భవనంలోని కింది ఫ్లోర్‌ని రెడీ చేసి, జూన్ 29న నిర్మాణ సంస్థలు ప్రభుత్వానికి అప్పగించనున్నాయి. ఆ రోజే తాత్కాలిక సచివాలయంలోకి పలు ప్రభుత్వ కార్యాలయాలు తరలి వెళ్ళనున్నాయి. హైద్రాబాద్ నుంచి తరలి వెళ్ళే విషయమై ఇప్పటికే సీఎస్, ఆయా శాఖలతో మంతనాలు జరిపారు కూడా. తాత్కాలిక సచివాలయానికి వెళ్ళే ఉద్యోగుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుండడం గమనార్హం.
మరోపక్క, విజయవాడతోపాటు గుంటూరులో పలు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. రెండేళ్ళు నాన్చినా, ఈ జూన్‌లో ఒకదాని తర్వాత ఒకటి.. శరవేగంగా కార్యాలయాల తరలింపు ప్రక్రియ జరుగుతుండడం అభినందనీయమే. ఓ వైపు గుంటూరు, ఇంకో వైపు విజయవాడ.. మధ్యలో తాత్కాలిక సచివాలయం కొలువుదీరుతున్న వెలగపూడి.. వెరసి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పండగ వాతావరణమే నెలకొంది.
ఇప్పటిదాకా, పరిపాలన ఆంధ్రప్రదేశ్ నుంచే జరగాలన్న విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నానా విమర్శలూ ఎదుర్కొన్నారు. ఉద్యోగుల తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు చంద్రబాబుపై విమర్శల తీవ్రతకు కాస్త బ్రేక్ పడింది. అదే సమయంలో, ఉద్యోగులూ ఆందోళన పక్కన పెట్టి, ఆనందం వ్యక్తం చేస్తున్నారు అమరావతికి తరలి వెళుతుండడంపై.
ఇక, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. తాత్కాలిక సచివాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి వుంది. అనుకున్న సమయం.. అంటే నేడే, సచివాలయం పూర్తిస్థాయిలో ప్రారంభమవ్వాల్సి వుంది. కానీ, అది జరగలేదు. ఎప్పటికి పూర్తిస్థాయిలో సచివాలయం, ప్రభుత్వం చేతికి వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇంకోపక్క గుంటూరు జిల్లాలో కొన్ని, కృష్ణా జిల్లాలో కొన్ని రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ప్రస్తుతానికి ఏది ఎక్కడ ఉందో తెలియని గందరగోళం. వీటన్నిటినీ మేనేజ్ చెయ్యాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
ఓ కార్యాలయం నుంచి ఇంకో కార్యాలయానికి ఏదన్నా ఫైల్ తరలి వెళ్ళాలంటే, నానా తంటాలూ పడాల్సిందే. అయితే, ఇవన్నీ కొద్ది రోజులే అనీ, వీలైనంత త్వరగా అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని మంత్రులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే చంద్రబాబుకి రాష్ట్రంలో మంచి మార్కులే పడుతున్నాయి. హైద్రాబాద్ నుంచి కార్యాలయాల తరలింపు ఇప్పటికైనా పూర్తయినందుకు ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రాజధాని, ఆత్మగౌరవం.. ఆ విషయంలో ఇంకా సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది.