ధనుష్.. ప్రాపర్ పబ్లిసిటీ లేకపోతే ఇంతే!

దీపావళి సందర్భంగా విడుదలైన సినిమాల్లో ప్రముఖమైనవి.. ఒకటి కాష్మోరా, రెండు ధర్మయోగి. ఈ సినిమాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే, కాష్మోరా కన్నా ఎక్కువ ప్రశంసలు పొందుతున్నది ధనుష్ సినిమా ‘ధర్మయోగి’నే! ప్రత్యేకించి తమిళ వెర్షన్ల రివ్యూలను పరిశీలిస్తే.. “కోడి’’ పేరుతో రూపొందిన ధనుష్ సినిమా ‘కచ్చితంగా చూడాల్సిన పొలిటికల్ థ్రిల్లర్’ అని రివ్యూయర్లు చెబుతున్నారు. తమిళనాట కాష్మోరాకు సో.. సో.. అనే రివ్యూలే వినిపిస్తున్నాయి. రేటింగ్స్ విషయంలో కార్తీ సినిమా ఐదింటికి సగం మార్కులే పొందుతుండగా, ధర్మయోగికి మాత్రం త్రిబుల్, త్రీ అండ్ హాఫ్ స్టార్ రేటింగులు దక్కుతున్నాయి!

అయితే.. తెలుగునాట మాత్రం ‘ధర్మయోగి’ కి ప్రాపర్ పబ్లిసిటీ లేకుండా పోయింది. ధనుష్ డబ్బింగ్ సినిమాలు తెలుగునాట హిట్టైన దాఖలాలు ఉన్నా.. ఈ తాజా సినిమా మాత్రం ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను ధనుష్ అంతగా పట్టించుకోకపోవడం.. ఈ సినిమా ప్రచారంలో ఎక్కడా ఆ హీరో పాత్రలేకపోవడంతో.. ‘ధర్మయోగి’ ఆసక్తిని రేకెత్తించలేకపోయాడు. 

అదే ‘కాష్మోరా’ విషయానికి వస్తే.. దాని ప్రొడ్యూసర్లు తెలుగు వాళ్లు, కార్తీ కి తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉండటంతో పాటు.. తమిళం కన్నా ఈ సినిమా తెలుగునాటే భారీ ఎత్తున విడుదల అయ్యింది. ‘కోడి’ విడుదల నేపథ్యంలో తమిళనాట కార్తీకి థియేటర్లే దక్కలేదు. తెలుగునాట  కార్తీకి ఆ ఇబ్బంది లేకపోయింది. 

పేపర్ యాడ్స్.. టీవీ యాడ్స్ ఇచ్చేస్తే.. సదరు సినిమాలకు జనాలు క్యూ కట్టే అవకాశాలు ఉండవు. హీరోల ఇంటరాక్షన్ కూడా ముఖ్యమే. కార్తీ సినిమాకు ఉన్నది, ధనుష్ సినిమాకు లేనిదీ అదే! దీంతో యావరేజ్ అనిపించుకున్న ఒక తమిళ హీరో సినిమా దీపావళి కలెక్షన్లను జుర్రేసుకుంటుంటే.. సూపర్ అనిపించుకున్న ఇంకో తమిళ హీరో సినిమా తెలుగు నాట జనాలను ఆకర్షించలేకపోతోంది!

Show comments