జయలలిత డెత్‌ మిస్టరీ.. కొత్త ట్విస్ట్‌.!

ముఖ్యమంత్రి అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. అందునా జయలలిత అంటే ఇంకేమన్నా వుందా.? ఆమెకంటూ వ్యక్తిగత వైద్యులుంటారు. ఆమెకంటూ కట్టుదిట్టమైన భద్రతా వలయం వుంటుంది. అలాంటి జయలలితపై ఎవరన్నా చెయ్యి చేసుకున్నారా.? తీవ్ర అనారోగ్యంతో బాధపడేంతలా ఆమె తన ఆరోగ్యాన్ని లైట్‌ తీసుకుంటారా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు.. దేనికీ సమాధానాల్లేవు. 

ఒక్కటే నిజం.. అదే జయలలిత మరణం. ఆమె చనిపోయారన్నదొక్కటే నిజం. ఎలా చనిపోయారన్నదానిపై కుప్పలు తెప్పలుగా అనుమానాలున్నాయి. జయలలిత ఆసుపత్రిలో చేరేటప్పటికే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడ్తున్నారని ఆమె చనిపోయిన రెండు నెలల తర్వాత తాపీగా వైద్యులు ప్రెస్‌మీట్‌ పెట్టి ఊకదంపుడు ప్రసంగం చేశారు. ఇంకోపక్క, రెండు నెలల తర్వాత అన్నా డీఎంకే సీనియర్‌ నేత పాండియన్‌, సెప్టెంబర్‌ 22న జయలలితపై దాడి జరిగిందనీ ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారనీ, అనుమానాస్పద స్థితిలో ఆమెను ఆసుపత్రిలో చేర్చడం, ఆ తర్వాత ఆమె దగ్గరకు ఎవరూ వెళ్ళకుండా శశికళ అడ్డుపడటం జరిగిందనీ ఆరోపించారు. జయలలితది సహజ మరణం కానే కాదన్నది ఆయన వాదన. 

అసలేం జరుగుతోంది తమిళనాడులో.? సరే, జయలలితకు తీవ్ర అనారోగ్యమే సంభవించిందనుకుందాం.. వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తోంది.? ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని పర్యవేక్షించలేనంత దయనీయ స్థితి తమిళనాడులో వుందా.? ఆమె ఆసుపత్రిలో చేరాక, చాలా రోజులపాటు అపస్మారక స్థితిలో వున్నారన్నది వైద్యుల వాదన. అలాంటప్పుడు, గవర్నర్‌ ఏం చేస్తున్నారట.? ఆమెకు సంబంధించిన విషయాలపై గవర్నర్‌ ఖచ్చితమైన ప్రకటన చెయ్యాలి కదా.! 

ఏదో జరిగింది.. ఇదొక 'కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌..' అన్న అనుమానాలు ఇప్పుడు మరింతగా బలపడ్తున్నాయి. ఓ రాజకీయ కుట్రకు జయలలిత బలైపోయారన్నది నిర్వివాదాంశం. ఆ కుట్ర బయటపడటం అంత తేలిక కాదు. ఓ ముఖ్యమంత్రి అనుమానాస్పద స్థితిలో 74 రోజులపాటు ఆసుపత్రిలో వుంటే, కేంద్రం పట్టించుకోకపోవడం కూడా ఇక్కడ అనుమానాస్పదమే. 

ఇంతకీ, పాండియన్‌ ఆరోపిస్తున్నట్లు పోయెస్‌ గార్డెన్‌లో సెప్టెంబర్‌ 22న గొడవ జరిగిందా.? జరిగితే, ఆ గొడవ ఎందుకు జరిగింది.? అన్నదిప్పుడు కీలకమైన అంశం. కేంద్రం, ఇప్పుడన్నా జయలలిత డెత్‌ మిస్టరీపై విచారణకు ఆదేశిస్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments