మరో హీరోయిన్‌కీ లైంగిక వేధింపులు

హీరోయిన్‌ భావన లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయమై పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఆమెని కిడ్నాప్‌ చేసి, ఆమెపై లైంగిక వేధింపులకు కొందరు పాల్పడటంతో, వారిని పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిన విషయాలే. తాజాగా, మరో హీరోయిన్‌ తనకూ లైంగిక వేధింపులు ఎదురయ్యాయంటూ సోషల్‌ మీడియాలో వాపోయింది. ఈ మేరకు ఓ 'భారీ లేఖని' ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

ఇంతకీ, ఆమె ఎవరో తెలుసా.? తమిళ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె వరలక్ష్మి. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రోగ్రామ్‌ హెడ్‌, తనతో అసభ్యకరంగా మాట్లాడాడని వరలక్ష్మి వాపోయింది. ఇంటర్వ్యూ ముగిశాక, బయట ప్రత్యేకంగా కలుద్దామని అతను తనతో చెప్పాడనీ, తాను కోపంగా చూసేసరికి, అతను సైలెంటయిపోయాడని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. ఈ ఘటన కొంతకాలం క్రితం జరిగిందనీ, అయితే ఇప్పటిదాకా లోలోపల బాధపడ్డానని, లేఖ ద్వరా తన ఆవేదన బయటపెట్టాలనుకున్నానని సోషల్ మీడియాలో వరలక్ష్మి పేర్కొంది. 

సినీ పరిశ్రమలోకి తాను వచ్చింది నటన మీద ప్యాషన్‌తో మాత్రమేననీ, తప్పుడు పనుల కోసం కాదని చెప్పిన వరలక్ష్మి, తనలాంటి ఎంతోమంది ఈ తరహా వేధింపులకు గురవుతున్నారనీ, అందరూ ఆ వేధింపుల్ని బయటపెట్టలేకపోతున్నారని వాపోయింది. మహిళల పట్ల సమాజంలో చిన్నచూపుకి ఇదొక నిదర్శనమనీ, మగాడి మైండ్‌ సెట్‌లో మార్పు రానంతవరకు మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగలేరని వరలక్ష్మి అభిప్రాయపడింది. 

అయితే, సదరు ప్రోగ్రామ్‌ హెడ్‌ ఎవరో అతని పేరుని బయటపెట్టేసి, అతనిపై వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసి వుంటే బావుండేదేమో.!

Show comments