గతవారం విడుదలైన విష్ణు సినిమా 'లక్కున్నోడు' నామమాత్రపు ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక ఫ్లాప్ అయింది. జనవరి 26 బరినుంచి సింగం 3 తప్పుకోవడంతో అప్పటికప్పుడు లక్కున్నోడు అనౌన్స్ చేసారు. నేషనల్ హాలిడేకి విడుదలైనప్పటికీ ఈ చిత్రానికి ఓపెనింగ్ రాలేదు.
సినిమాపై ఎలాంటి బజ్ లేకపోవడానికి తోడు టాక్ కూడా వీక్‌గా రావడంతో లక్కున్నోడు డిజాస్టర్ అయింది. ఇక గత వారం కూడా సంక్రాంతి సినిమాల హవానే కొనసాగింది. 'ఖైదీ నంబర్ 150' వంద కోట్ల షేర్ సాధించిన రెండవ తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది.
శతమానం భవతి ముప్పయ్ కోట్ల క్లబ్‌లో చేరి సంచలనాలకే సంచలనమైంది. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా హిట్ స్టేటస్ తెచ్చుకోవడంతో ఈ సంక్రాంతి సినిమాలన్నీ మార్కెట్‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఈవారం నేను లోకల్‌తో పాటు కనుపాప అనే అనువాద చిత్రం రిలీజ్ అవుతోంది. ఫిబ్రవరిలో వారానికి కనీసం ఒకటి, రెండు చెప్పుకోతగ్గ సినిమాలు విడుదల కానున్నాయి కనుక ఈ నెల కూడా బాక్సాఫీస్ బిజీగానే ఉంటుంది.