ఎమ్బీయస్‌: అఖిలేశ్‌కే సైకిల్‌!

ఎన్నికల కమిషన్‌ సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తయిన సైకిల్‌ను అఖిలేశ్‌ వర్గానికే కేటాయించింది.  పార్టీ ఎమ్మెల్యేలలో 206 మంది, ఎమ్మెల్సీలలో 56 మంది, ఎంపీలలో 15 మంది, జాతీయ కార్యవర్గంలో 30 మంది, సాధారణ కార్యకర్తల్లో అధిక సంఖ్యాకులు తమ వైపే వున్నారని అఖిలేశ్‌ వర్గం దాఖలాలు సమర్పించడంతో యిది సాధ్యపడింది.

'నేను పార్టీ వ్యవస్థాపకుణ్ని కాబట్టి పార్టీ నాదే, ఎన్నికల గుర్తూ నాదే' అనే వాదన తప్ప ములాయం వేరే ఏ వాదనా వినిపించలేకపోయారు. నిజానికి యీ పరిణామాన్ని అఖిలేశ్‌ కూడా వూహించలేదు. ఎందరు తమవైపు నిలుస్తారో, ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తుందో తెలియదు కాబట్టి రాం గోపాల్‌ యాదవ్‌ నవంబరులో ఎన్నికల కమిషన్‌ సభ్యులను కలిసి ఒక వేళ సైకిలు గుర్తు దక్కకపోతే మోటారు సైకిల్‌ గుర్తయినా యిస్తారా అని అడిగి చూశాడు.

ఎస్పీలోని అంతఃకలహాలను తనకు అనువుగా వాడుకోవడానికి బిజెపి ఎన్నికల కమిషన్‌ ద్వారా సైకిలు గుర్తును స్తంభింపచేస్తుందని, కొత్త గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి  రెండు వర్గాలకు సమయం చాలదు కాబట్టి ఘోరంగా నష్టపోతాయని కొందరు అంచనాలు వేశారు. కానీ ఆ అంచనాలు తల్లకిందులయ్యాయి. కమిషన్‌ సైకిలును అఖిలేశ్‌కు యిచ్చేసింది. ఇక కొత్త పార్టీ పెట్టుకుని, కొత్త గుర్తు కోసం అడగవలసిన పని ములాయం వర్గంపై పడింది. సామాజిక మాధ్యమాలు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి యిది మరీ అంత కష్టం కాదని కొందరు, గతంలో కంటె సులభమే కానీ, యిప్పటికీ కష్టమే అని మరి కొందరూ వాదిస్తున్నారు.

అఖిలేశ్‌కు పార్టీ నాయకులలో అధిక సంఖ్యాకుల మద్దతుతో పాటు ఎన్నికల గుర్తు కూడా లభించింది కాబట్టి పార్టీని అభిమానించేవారంతా అతనివైపే నిలుస్తారని వూహించవచ్చు. ములాయం ఆరోగ్యం సరిగ్గా లేదు, పైగా రెండో భార్య మాట విని మొదటి భార్య కొడుక్కి అన్యాయం చేశాడన్న యిమేజి తోడవడంతో కార్యకర్తలు అతని వర్గాన్ని ఆదరించకపోవచ్చు. శివపాల్‌ ఎంత మంచి ఆర్గనైజర్‌ అయినా అతని మొహం చూసి ఓట్లేయరు. Readmore!

ఎస్పీ రెండు వర్గాలుగా చీలిపోయి, ఎవరికీ ఎన్నికల గుర్తు లభించదని వూహిస్తున్న సమయంలో జరిగిన మూడు అభిప్రాయ సేకరణల ఫలితాలను కలిపి చూస్తే బిజెపికి 175, ఎస్పీకి 113, బియస్పీకి 100 వస్తాయని తేలింది. కొత్త పరిస్థితిలో యీ అంకెలు ఎలా మారతాయో తెలియదు. ఎందుకంటే సమాజ్‌వాదీ పార్టీ సమభాగాలుగా విడిపోయి వుంటే దానికి వెన్నెముకగా నిలిచిన బిసి ఓటుబ్యాంకు (జనాభాలో 44%)లోకి బిజెపి చొచ్చుకుపోయి వుండేది. అగ్రవర్ణాలు (జనాభాలో 16%), బిసిలలో కూర్మీ వర్గం బిజెపి వైపు, ముస్లిములు, దళితులు (జనాభాలో 21%) బియస్పీ వైపు మోహరించి వుండేవి. కాంగ్రెసు అఖిలేశ్‌ వర్గంతో చేతులు కలిపినా బిజెపిని ఓడించగలవనే నమ్మకం చాలక ముస్లిములు (జనాభాలో 19%) ఆదరించేవారు కారు. దళితులలో ఒక వర్గం కూడా కాంగ్రెసువైపు మొగ్గు చూపుతుందో లేదో అనుమానమే! కానీ యిప్పుడు అఖిలేశ్‌ వర్గమే నెగ్గడంతో అతనికి యూత్‌లో పాప్యులారిటీ వుండడంతో, అతనికి దీటుగా ఎవరినైనా యువనేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలపవలసిన పని బిజెపికి పడింది. బిజెపిని ఓడించే సత్తా అఖిలేశ్‌ ప్లస్‌ కాంగ్రెసు కూటమికి వుందని తోస్తే ముస్లిములు బియస్పీని కాకుండా అతన్నే సమర్థించవచ్చు. అదే నమ్మకంతో కాంగ్రెసు అంటే అభిమానం వున్న దళితుల్లో ఒక వర్గం కూడా ఆ కూటమిని సమర్థించవచ్చు. 

ఈ పరిస్థితి తనంతట తాను వచ్చి అఖిలేశ్‌ ఒళ్లో పడలేదు. తన సవతి తల్లి కుటుంబం, బాబాయి కుటుంబం చేతులు కలిపి తన చేతులు కట్టేసి తనకు అప్రతిష్ఠ తెచ్చారని అందుకనే 2014 పార్లమెంటు ఎన్నికలలో ఘోరమైన ఫలితాలు వచ్చాయని గుర్తించిన దగ్గర్నుంచి అఖిలేశ్‌ పరిస్థితి చక్కదిద్దాలని భావించాడు. కుటుంబంలో అస్మదీయులెవరో, తస్మదీయులెవరో కూడా లెక్క వేసుకున్నాడు. సమాజ్‌వాదీ పార్టీలో ములాయం వైపు వున్న ప్రముఖులలో అతని రెండవ భార్య సాధన ప్రముఖురాలు. ఆమె తెరవెనుక రాజకీయాలు నడపడంలో దిట్ట. వైశ్య కులానికి చెందినది కాబట్టి ఆ కులంవారితో సత్సంబంధాలున్నాయి. ఆమె కొడుకు ప్రతీక్‌ యాదవ్‌ ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేడు కానీ అఖిలేశ్‌పై కోపంతో అతన్ని పడగొట్టడానికి  శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అతని భార్య అపర్ణ లఖ్‌నవ్‌ కంటోన్మెంటు ప్రాంతం నుంచి అభ్యర్థిగా నిలబడుతోంది. ఈ ముగ్గురికీ అఖిలేశ్‌ అంటే పడదు. వీరి యిల్లు ములాయం తమ్ముడు శివపాల్‌ యింటి పక్కనే వుంది. శివపాల్‌ అంటే ములాయంకు చాలా నమ్మకం. అఖిలేశ్‌ను అణచడానికి అతని శక్తిసామర్థ్యాలపైనే నమ్ముకున్నాడు.

శివపాల్‌ భార్య సరళకు అఖిలేశ్‌తో సత్సంబంధాలున్నాయి. కానీ ఆమె రాజకీయాల్లో చురుకుగా లేదు. ఆమె కొడుకు అంకుర్‌కు కూడా అఖిలేశ్‌ అంటే యిష్టమే కానీ తండ్రికి వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. అఖిలేశ్‌ పక్షాన వున్నవారిలో అతని భార్య డింపుల్‌ వుంది. 2012లో కనౌజ్‌ నుంచి ఎంపీగా నెగ్గింది. ఆమెకు మావగారు ములాయంతో, సవతి అత్త సాధనతో మంచి సంబంధాలున్నాయి. ములాయంకు కజిన్‌ ఐన రాంగోపాల్‌ యాదవ్‌ అఖిలేశ్‌కు వెన్నుదన్నుగా నిలిచి పార్టీని నడిపిస్తున్నాడు. అతనికి శివపాల్‌ అంటే పడదు. 2014 పార్లమెంటు ఎన్నికలలో అభ్యర్థులను ఎంపిక చేసినది అతనే. అతని కుమారుడు, ఫిరోజాబాద్‌ నుంచి ఎంపీ ఐన అక్షయ్‌ కూడా అఖిలేశ్‌ వైపే. ములాయం తమ్ముడు అభయ్‌రామ్‌ కొడుకు, బదౌన్‌ ఎంపీ ఐన ధర్మేంద్ర, ములాయం అన్నగారు రతన్‌ మనుమడు, లాలూ ప్రసాద్‌ అల్లుడు ఐన తేజ్‌ ప్రతాప్‌, ములాయం కజిన్‌ ఐన గీతాదేవి కొడుకు, ఎమ్మెల్సీ ఐన అరవింద్‌ - వీళ్లంతా కూడా అఖిలేశ్‌ వైపే.

కుటుంబంలో తన స్థానాన్ని బలపర్చుకుంటూనే 2017 ఎన్నికల నాటికి పార్టీలతో సంబంధం లేకుండా యువతలో తన యిమేజి పెంచుకోవాలని రెండేళ్ల క్రితమే ప్లాను చేసి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాడు. అంతేకాదు, రాజకీయంగా సరైన రణనీతి అవసరమని భావించి 2016 సెప్టెంబరులో హార్వర్డ్‌ యూనివర్శిటీకి చెందిన స్టీవ్‌ జోర్డాన్‌ను తన పార్టీ స్ట్రాటజిస్టుగా నియమించుకున్నాడు. స్టీవ్‌ అఖిలేశ్‌ అభివృద్ధి పథకాల తీరుతెన్నులను అధ్యయనం చేయడంతో బాటు, ఎస్పీ ఎమ్మెల్యేలను కలిసి నియోజకవర్గాల వారీగా బలాబలాలను అంచనా వేసి, ఏ నియోజకవర్గంలో ఎలాటి వాగ్దానాలు చేయాలో కూడా నిర్దేశించాడు. ఎస్పీకి హింసారాజకీయాల ముద్ర వుంది. అఖిలేశ్‌ దానికి దూరంగా జరిగి, ఆ ముద్రను శివపాల్‌కు అంటగట్టేశాడు. అధికారం కోసం తండ్రిని ఎదిరించి వుంటే భారతీయ ఓటరు ఏవగించుకునేవాడు. అందుకని తను తండ్రిని గౌరవిస్తూనే వుంటానని , పార్టీ విడిచి వెళ్లననీ చెప్పుకుంటూ వచ్చాడు. జనవరి 1న జరిగిన మీటింగులో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తండ్రి స్థానాన్ని ఆక్రమిస్తూనే పార్టీ పథనిర్దేశకుడిగా తండ్రి పేరును ప్రతిపాదించి, ప్రజలలో వ్యతిరేకత రాకుండా చూసుకున్నాడు. ఆనాటి సమావేశంలో అఖిలేశ్‌కు పక్కన కూర్చున్న సీనియర్‌ నాయకుడు రేవతి రమణ్‌ సింగ్‌, పార్టీ జనరల్‌ సెక్రటరీ కిరణ్మయ్‌ నందా, రాజ్యసభ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ వంటి ఒకప్పటి ములాయం సమర్థకులే! తండ్రిని గౌరవిస్తూనే అదే వూపులో శివపాల్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాడు, అమర్‌ సింగ్‌ను పార్టీలోంచి బహిష్కరించాడు. అంతేకాదు, జనాభాలో 7.5% వున్న కూర్మీలపై బిజెపి కన్నేసిందని తెలిసి అఖిలేశ్‌ నరేశ్‌ ఉత్తమ్‌ అనే కూర్మీ నాయకుణ్ని తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాడు.

అభివృద్ధి నినాదం కారణంగా యువతలో మోదీకి మోజు వుందని అఖిలేశ్‌కు తెలుసు. మోదీతో పోటీ పడడానికి ఆయన వారణాశిలో భారీ సమావేశం ఏర్పాటు చేసిన డిసెంబరు 22నే ఆ నగరంలో 50 మీటర్ల మేర నదీతీరాన్ని అభివృద్ధి పరిచిన వరుణా రివర్‌ కారిడార్‌ను ఆవిష్కరించాడు. 2017 డిసెంబరు నాటికి మరో 10 కి.మీ. ల నదీతీరాన్ని మెరుగు పరుస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాదు గత నెలలోనే, రూ.5 వేల కోట్ల విలువ చేసే 12 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాడు. సమాజ్‌వాదీకి పట్టున్న ఉత్తర యుపిలో (2012 ఎన్నికలలో అక్కడ 60% సీట్లు గెలిచింది) 354 కి.మీ.ల సమాజ్‌వాదీ పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను అభివృద్ధి పరుస్తున్నాడు. వీటన్నిటితో బాటు కులసమీకరణాలు కూడా చూసుకుంటున్నాడు. అతని కాబినెట్‌ డిసెంబరు 22న ఒక తీర్మానం చేసి జనాభాలో 14% వున్న 17 బిసి ఉపకులాలను షెడ్యూల్‌ కులాలుగా మార్చేసింది. ఇలా రిజర్వేషన్‌ సౌకర్యం పొందిన యీ వర్గాలు ఎస్పీవైపుకి సాంతం మొగ్గు చూపితే వారు కీలకంగా వున్న అనేక నియోజకవర్గాలు పార్టీ కైవసం అవుతాయి.

అఖిలేశ్‌కు యూత్‌లో వున్న యిమేజికి తోడు, పార్టీపై పట్టు కూడా దొరికింది. కాంగ్రెసు అతనితో పొత్తు కట్టడానికి ఉవ్విళ్లూరుతోంది. మైనారిటీలు, దళితుల్లో ఒక వర్గం అతని పక్షాన నిలవవచ్చు. ఇంత చేసినా బిజెపిని తట్టుకోవడం కష్టమే. అయితే బిజెపి పక్షాన అఖిలేశ్‌తో తూగే యువనాయకుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరూ ముందుకు రాలేదు. మోదీ ప్రధాని పదవి వదిలి యుపి సిఎంగా రారని యుపి ఓటరుకూ తెలుసు. అందువలన ఎవరో ఒకరిని బిజెపి ప్రకటించాలి. అలా ప్రకటించిన కొన్ని సందర్భాల్లో బిజెపి ఓడిపోయింది. అందువలన మోదీ ఫోటోలతోనే ముందుకు సాగుతోంది. ఈ పథకం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2017)

Show comments