అభిమాని బ్లాక్‌మెయిల్‌కి బెదిరిన హీరో.!

సరదాగానో.. సీరియస్‌గానో.. అభిమానంతోనో.. ఆవేదనతోనో.. ఓ అభిమాని, ఓ హీరోకి ఝలక్‌ ఇచ్చాడు. 'తదుపరి సినిమా గురించి అనౌన్స్‌ చెయ్యకపోయావో, జాగ్రత్త.. నిరాహార దీక్ష చేస్తాను..' అన్నది ఆ అభిమాని, తన అభిమాన హీరోకి ఇచ్చిన ఝలక్‌. 'లవ్‌ యూ..' అని చెప్పాడుగానీ, మేటర్‌లో సీరియస్‌నెస్‌ అయితే సుస్పష్టం. ఇంకేముంది, ఆ హీరో షాక్‌ తిన్నాడు.! 

ఆ హీరో ఎవరో కాదు, యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌. 'హైపర్‌' సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడీ కుర్రాడు. రకరకాల గెటప్‌లు ట్రై చేస్తూ, సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాడు. 'కొత్త సినిమా కోసమేనా.?' అని అభిమానులు ప్రశ్నించడం మామూలే. ఇంకోపక్క, తమ అభిమాన హీరో ఎప్పుడు కొత్త సినిమాపై కబురు చెబుతాడో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఆందోళన చెందడానికేముంది.. అంటారా.? అభిమానుల సెంటిమెంట్లు అలాగే వుంటాయ్‌ మరి.! 

'ఇలాంటి కొత్త టెన్షన్‌ పెట్టకు తమ్ముడూ..' అంటూ తన అభిమాన హీరో, తనకు ఇచ్చిన అల్టిమేటంపై హీరో రామ్‌ కాస్తంత కంగారుగానే స్పందించాడు. ప్రస్తుతం కొత్త సినిమా విషయమ్మీద కసరత్తులు చేస్తున్నాన్నాడు రామ్‌. 

సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలు తమ అభిమానులతో సరదా సరదాగా టైమ్‌ పాస్‌ చేయడం వరకూ బాగానే వుంది ఇందులో 'అతి' అభిమానులు అప్పుడప్పుడూ సెలబ్రిటీల్ని ఇరిటేట్‌ చేసేస్తుంటారు. సినిమా చెయ్యాలా.? వద్దా.? ఎలాంటి సినిమా చేయాలి.? వంటి అంశాలపై ఆయా నటీనటులకీ కొన్ని సమస్యలుంటాయి.. కొన్ని ఆలోచనలూ వుంటాయి. తొందరపెట్టేస్తే ఎలా.! పైగా, ఈ బ్లాక్‌మెయిల్‌ ఒకటి. వెర్రి వెయ్యి విధాలు.. అనేది ఇందుకేనేమో.!

Show comments