ఉత్తరాంధ్రలో కొత్త 'పవర్‌' సెంటర్‌.!

స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు తర్వాత ఆ స్థాయిలో పవర్‌ సెంటర్‌గా ఆయన సోదరుడు, మంత్రి అచ్చెన్నాయుడు ఎదుగుతున్నారా.? ఈ మాటకి అవుననే సమాధానం విన్పిస్తోంది. మొదట్లో బాబాయ్‌ - అబ్బాయ్‌ (ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్‌నాయుడు) మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌తో మొత్తంగా తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లాలో అభాసుపాలయ్యే పరిస్థితి వచ్చినా, ఇప్పుడు ఆ పరిస్థితి కన్పించడంలేదు. 

ఇక, మంత్రి వర్గంలోనూ అచ్చెన్నాయుడు తనదైన ముద్ర వేస్తున్నారు. అంటే, తన శాఖ పరంగా ఉద్ధరించేస్తున్నారని కాదు.. మంత్రి వర్గ సహచరులపై ఇప్పుడిప్పుడే అచ్చెన్నాయుడు పట్టు సాధిస్తున్నారని పార్టీ వర్గాల్లోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఆ మధ్య, 'నేనే కాబోయే కొత్త హోంమంత్రిని..' అంటూ అచ్చెన్నాయుడు, మీడియాకి లీకులు పంపించడం, అనుచరులతో హడావిడి చేయించడం తెల్సిన విషయాలే. 

ఉత్తరాంధ్ర రాజకీయాలు చిత్రంగా కన్పిస్తుంటాయి. అందునా, శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి ఇంకా భిన్నంగా కన్పిస్తుంటుంది. పవర్‌ఫుల్‌ లీడర్స్‌ వున్నా, ప్రభుత్వం మీద పట్టు సాధించడం అనేది చాలా అరుదు. కీలక నేతలుగా ఎదిగినవారే, ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తుని గందరగోళంలో పడేసుకుంటుంటారు. అందుక్కారణం, అక్కడి రాజకీయ సమీకరణాలే. ధర్మాన ప్రసాదరావు, వైఎస్‌ హయాంలో ఏ స్థాయిలో ఎదిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక, తమ్మినేని సీతారాం టీడీపీ ముఖ్య నేతగా ఓ వెలుగు వెలిగారు. ఈ ఇద్దరి పరిస్థితీ ఇప్పుడు రాజకీయంగా అగమ్యగోచరమైన స్థితిలో వుంది. 

ఎర్రన్నాయుడు, ఉత్తరాంధ్రలోనే కాక.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే పాపులర్‌ లీడర్‌గా ఎదిగినట్లే ఎదిగి, తన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. మరి ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు.. తన అన్ననే మించిపోతారా.? రాజకీయాల్లో తనదైన ముద్ర వేయగలుగుతారా.? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తిరుగులేని నేత అన్పించుకుంటారా.? అంటే, ఆయన, ఆయన అనుచరులు చేస్తున్నంత హడావిడి అక్కడేమీ లేదనీ, శ్రీకాకుళం జిల్లా వరకూ అచ్చెన్నాయుడు 'పవర్‌' కన్పించినా, ఉత్తరాంధ్ర మొత్తంగా చూసుకుంటే ఆయనకు అంత సీన్‌ లేదంటూ ఉత్తరాంధ్రలో మిగతా టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా వ్యాఖ్యానిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు తదితర నేతల ముందు అచ్చెన్నాయుడు హవా ఎంత? అన్నది వారి ప్రశ్న. 

ఏదిఏమైనా, అచ్చెన్నాయుడు.. ఇప్పుడు ఉన్న స్టేజ్‌, రాజకీయాల్లో ఆయనకి అత్యుత్తమం.. అంటున్నారు రాజకీయ పరిశీలకులు.. అదీ టీడీపీ పరంగా మాత్రమే.

Show comments