అనుష్క 'బిగ్‌' ప్లాన్స్‌.!

బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ 'బిగ్‌' ప్లాన్స్‌తో వున్నానంటోంది. హీరోయిన్‌గా ఆల్రెడీ మంచి పొజిషన్‌లో వున్న అనుష్క శర్మ నిర్మాతగానూ, టాప్‌ లీగ్‌లోకి వెళ్ళాలని ఉబలాటపడుతోంది. గతంలో 'ఎన్‌హెచ్‌10' సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న అనుష్క, తాజాగా 'పిల్లౌరి' చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం విదితమే. ఈ రెండు సినిమాలకూ సహ నిర్మాతగానే నిచేసింది అనుష్క. ఇంకో రెండు మూడు సినిమాలు ఇదే తరహాలో నిర్మిస్తాననీ, ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాతగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తానని అనుష్క చెప్పుకొచ్చింది. 

మోడలింగ్‌ కెరీర్‌, నటన.. ఇవేవీ ప్లాన్‌ చేసుకున్నవి కావనీ, సినిమా నిర్మాణం వైపుగా అడుగులు వేయడం కూడా ఆలోచించి చేసింది కాదని అంటోన్న అనుష్క, దర్శకత్వం వైపు వెళ్ళే ఆలోచన మాత్రం లేదని తెగేసి చెప్పింది. సినిమా నిర్మాణం సందర్భంగా సినిమాకి సంబంధించి అన్ని విభాగాలపైనా ఆసక్తి కలగడం సహజమే అయినా, క్రియేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ విషయంలో జోక్యం చేసుకోబోనని చెప్పుకొచ్చింది. 

కథ ఎంపిక వరకూ సినీ రంగంలో తనకున్న అనుభవాన్ని కొంత మేరకు ఉపయోగిస్తాను తప్ప, ఆ అనుభవాన్ని దర్శకుడి మీద రుద్దే ప్రయత్నమేదీ చేయబోనని అనుష్క స్పష్టం చేసింది. విరాట్‌ కోహ్లీ సహాయం తీసుకుని, సినీ నిర్మాతగా ఎదగాల్సిన అవసరం తనకు లేదనీ, తమ మధ్య ఎప్పుడూ సినిమాల గురించిన చర్చలే జరగవని అనుష్క చెప్పుకొచ్చింది. ఖచ్చితంగా రెండేళ్ళలోనే బిగ్‌ మూవీతో నిర్మాతగా అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తానంటున్న అనుష్క, అన్నంతపనీ చేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Show comments