ది గ్రేట్‌ ఎన్‌.టి.ఆర్‌. క్లయిమాక్స్‌ లేదు మిత్రమా.!

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తాకరామారావు జీవిత చరిత్ర సినిమాగా వస్తోందంటే, ఆనందించని తెలుగవారెవరూ వుండరు. ఎందుకంటే, తెలుగు సినీ ప్రస్థానంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ ఓ చరిత్ర. పౌరాణిక చిత్రాలైనా, సాంఘీక చిత్రాలైనా.. తెలుగు తెరపై స్టార్‌డమ్‌కి ఆద్యుడు ఆయనే. సాక్షాత్తూ ఆయన కుమారుడే, తన తండ్రి జీవిత చరిత్రను సినిమాగా తీస్తానంటే, అంతకన్నా అద్భుతం ఇంకేముంటుంది.? స్వర్గీయ ఎన్టీఆర్‌ పుత్రరత్నం, నందమూరి బాలకృష్ణ చేసిన ప్రకటన తెలుగు నాట ఓ సంచలనమే అయ్యింది. అయితే, ఆ సంచనాల చుట్టూ అనుమానాలూ వున్నాయండోయ్‌.! ఎందుకంటే, స్వర్గీయ ఎన్టీఆర్‌ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు.. రాజకీయ ప్రముఖుడు కూడా. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ న భూతో న భవిష్యతి అనే స్థాయిలో అతని ప్రస్థానం కొనసాగింది మరి. నటనా జీవితంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. అసలాయన స్టార్‌డమ్‌కి ఎదురే లేకుండా పోయింది. రాజకీయాల్లో అలా కాదు, జీవిత చరమాంకంలో రాజకీయంగా అత్యంత పతనావస్థను ఆయన చవిచూసేశారు.

హీరో బాలకృష్ణ.. విలన్‌ ఎవరు.?

హీరో పాత్రలో.. అంటే తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్రలో తానే నటిస్తానని బాలకృష్ణ ప్రకటించేశారు. సినిమా అన్నాక ప్రతినాయకుడు.. అదేనండీ విలన్‌ వుండాలి కదా. సినీ రంగంలో ఎన్టీఆర్‌కి విలన్లు ఎవరూ లేరు. కానీ, రాజకీయాల్లో వున్నారు. ఆ విలన్‌ ఎవరో కాదు, ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయేడే. కానీ, ఆయన్ని విలన్‌గా చూపించే సాహసం బాలకృష్ణ చెయ్యబోరు. ఎందుకో అందరికీ తెలుసు కదా.! బాలయ్యబాబుకి, చంద్రబాబు వియ్యంకుడు. పైగా ముఖ్యమంత్రి. స్వర్గీయ ఎన్టీఆర్‌ తన రాజకీయ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తారనీ, టీడీపీ పగ్గాలు బాలకృష్ణే చేపడ్తారనీ, ఆకాంక్షించారు. కానీ, బాలకృష్ణ మాత్రం బావ చంద్రబాబు నీడలో ఎమ్మెల్యే పదవితో సరిపెట్టేసుకున్నారు. రాజకీయంగా తనకు నీడ కల్పించిన చంద్రబాబుని బాలకృష్ణ విలన్‌గా ఎందుకు చూపిస్తారు.?

విలన్‌ కాదు, విలన్లున్నారండోయ్‌.!

Readmore!

స్వర్గీయ ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంలో విలన్‌ కాదు, విలన్లు వున్నారని చెప్పొచ్చేమో. ఆ విలన్లు ఎవరు.? అన్నది ఆయా సందర్భాల్ని బట్టి, ఆయా కోణాల్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది. చంద్రబాబు కోణంలో చూస్తే, లక్ష్మీ పార్వతి పెద్ద విలన్‌. అదే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా విలనే. నాదెండ్ల భాస్కర్‌రావు కూడా విలనేనన్నది ప్రస్తుత టీడీపీ నేతల వాదన. ఈ ముగ్గురి కోణంలో చూస్తే చంద్రబాబే అందరికన్నా పెద్ద విలన్‌. టీడీపీ జెండా పక్కన పెట్టి, బౌండరీ లైన్‌ అవతలినుంచి చూస్తే.. బాలకృష్ణకి, ఎన్టీఆర్‌ జీవిత చరిత్రలో విలన్లు ఎవరన్నది స్పష్టమవుతుంది. కానీ, ఆయన ఆ సాహసం చేయబోరు. ఎందుకంటే, బావ కోసం కదా బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నది. 'ఎక్కడ ముగించాలో నాకు తెలుసు..' అని బాలయ్య చెప్పారుగానీ, తండ్రి చివరి రోజుల్లో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని ఆయన చెవికెక్కించుకుని వుంటే.. ఆ మాట ఆయన అనరుగాక అనరు. అసలు, తెలుగుదేశం పార్టీలోనే వుండరు.

క్లయిమాక్స్‌ వుండదట, నిజమేనా బాలయ్యా.?

అసలు గొడవంతా ఎందుకు.? స్వర్గీయ ఎన్టీఆర్‌ని యుగపురుషుడిగా చూపించేసి, వివాదాస్పద అంశాల జోలికి పోకుండా వుంటే బావుంటుంది కదా.. అనే ఆలోచన కూడా చేస్తున్నారట బాలకృష్ణ. నిజంగానే బాలకృష్ణ ఈ ఆలోచన చేస్తే, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఎలా సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది.? ఛాన్సే లేదు. ఎట్నుంచి ఎటు చూసినా, బాలకృష్ణ - ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర.. అనే కాన్సెప్ట్‌ని ఎంచుకోవడమే 'తన తాహతుకు మించిన వ్యవహారం' అన్నది సినీ, రాజకీయ విశ్లేషకుల వాదన. ఇంతకీ, బాలకృష్ణ నిజంగానే ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నారా.? 'కథ తయారవుతోంది..' అంటూ జనం మర్చిపోయేదాకా వ్యవహారాన్ని సాగదీస్తారా.? ఈలోగా సినిమా తీసేస్తే, దాంట్లో ఎన్టీఆర్‌ ఆఖరి రోజులు కన్పిస్తాయా.? కన్పిస్తే, ఎన్టీఆర్‌ ఘోషని వక్రీకరించకుండా వుంటారా.? ఇవన్నీ ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలే.

- సింధు

Show comments