మీడియాకి క్లాస్‌ తీసుకున్న మాజీ డీజీపీ

మాజీ డీజీపీ, బీజేపీ నేత దినేష్‌రెడ్డి మీడియా ముందుకొచ్చారు. గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌లో పోలీసు శాఖను అభినందిస్తున్నట్లు ప్రకటించారాయన. నయీమ్‌తో తనకెలాంటి సంబంధాలూ లేవని చెప్పారు దినేష్‌రెడ్డి. 'నాకే కాదు, డీజీపీ స్థాయి అధికారులతో ఇలాంటివాళ్ళకు సంబంధాలు వుండే ఛాన్సే లేదు..' అని స్పష్టం చేశారు ఈ మాజీ డీజీపీ. 

బీజేపీ నేతగా, మాజీ డీజీపీగా నయీమ్‌ ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తున్నాననీ, మీడియాలో 'మాజీ డీజీపీ.. ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ డీజీపీ, పార్టీ మారిన మాజీ డీజీపీ..' అంటూ వార్తలొస్తుండడంతో తాను స్పందించాల్సి వచ్చిందని దినేష్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇన్‌ఫార్మర్లతో మేగ్జిమమ్‌ అంటే డిఐజి స్థాయి అధికారికి సంబంధాలు వుండవచ్చనీ, పలు కేసుల్లో కొందర్ని ఇన్‌ఫార్మర్లుగా వాడుకోవడం మామూలేగానీ, వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటే అది క్షమార్హం కాని నేరమని దినేష్‌రెడ్డి అంటున్నారు. 

'సిట్‌' విచారణ జరుగుతోంది గనుక, ఆ సిట్‌ ఏ విషయాల్ని వెల్లడిస్తుందో వేచి చూడాలి తప్ప, మీడియా అనవసరంగా ఊహాగానాల్ని తెరపైకి తెచ్చి, టీఆర్పీ రేటింగుల కోసం పాకులాడకూడదని మీడియాకి క్లాస్‌ పీకారు దినేష్‌రెడ్డి. గతంలో ఓ మీడియా ఛానల్‌ తనపై అవాస్తవాలు ప్రచారం చేసి, ఆ తర్వాత క్షమాపణ చెప్పిందనీ, ఇప్పుడు చాలా మీడియా ఛానళ్ళు, పత్రికలు తన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చెయ్యాలని చూస్తుండడం బాధాకరమని దినేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

సిట్‌ విచారణపై ఏమన్నా అనుమానాలుంటే పార్టీ వేదికలపై చర్చించి, మెరుగైన విచారణను కోరతామనీ, ప్రస్తుతానికైతే సిట్‌ విచారణాధికారులుగానీ, పోలీసు శాఖగానీ, ప్రభుత్వం తరఫునగానీ ఈ కేసులో ఫలానా రాజకీయ నాయకుడున్నాడనో, ఫలానా పోలీసు అధికారి ఇరుక్కన్నాడనో ప్రకటనలు రాలేదు కాబట్టి, ఊహాగానాలకు ఇది సందర్భమే కాదని దినేష్‌రెడ్డి తేల్చి పారేశారు. 

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత మీడియా ముందుకొచ్చి విరమణ ఇచ్చుకున్నవారిలో దినేష్‌రెడ్డి రెండో వ్యక్తి. టీడీపీ నేత ఉమా మాధవరెడ్డి ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించిన విషయం విదితమే.

Show comments