చంద్రన్నకు కేంద్రం తలంటిందా..!

ఒకవైపు సిద్ధార్థ్ సింగ్ స్పందన.. మరోవైపు చంద్రబాబు వివరణ.. ఈ రెండు పరిణామాలతో పాటు ఢిల్లీ వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం, నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు తలంటినట్టుగా తెలుస్తోంది. నోట్ల రద్దు తో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయంలో కేంద్రం తీరుపై బాబు అసహనం వ్యక్తం చేసిన సంగతి  తెలిసిందే.

తన జీవితంలో ఇలాంటి విపత్తును చూడలేదని ఇది వరకే వ్యాఖ్యానించిన చంద్రబాబు ఇటీవల తన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తను ఆగస్టు సంక్షోభాన్నే నెల రోజుల్లో అధిగమించాను అని, అలాంటిది.. కేంద్రం ఈ విషయంలో పూర్తి గా విఫలం అయ్యిందని బాబు వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇది పరిష్కారం లేని సమస్య అని.. తను దేనికైనా పరిష్కారం చెప్పే వాడిని కానీ, ఈ విషయంలో పరిష్కారం తనకు తట్టడం లేదని వ్యాఖ్యానించినట్టుగా కూడా బాబు అనుకూల మీడియా కూడా వార్తలు రాసింది.

మరి ఇది వరకూ నోట్ల రద్దు చేయాలని లేక రాశానని ప్రకటించి, తన సూచన మేరకే నోట్ల రద్దు జరిగిందని ప్రకటించుకున్న చంద్రబాబు..ఇలా మాటలు మార్చడం ఆయన సహజమైన ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలిచింది.

బాబు వ్యాఖ్యానాలు తెలుగులోనే జరిగినా.. ఈ వ్యవహారంలో ఆయన రంగు మార్పిడి ఢిల్లీ వరకూ వెళ్లింది. వెంటనే సిద్ధార్థ్ సింగ్ కూడా స్పందించాడు. నోట్ల రద్దును బాబు సమర్థించాడు.. అని ఆయన స్పష్టం చేశాడు. ఇదే సమయంలో.. కేంద్రంలోని పెద్దలు.. బాబు తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

Readmore!

ఒకవైపు ఎన్డీయేతర ముఖ్యమంత్రులు నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. బాబేమో.. కొద్ది సేపు అలా, కొద్ది సేపు ఇలా మాట్లాడుతున్నారు. మంచి జరుగుతుందంటే నా సలహా, కాకపోతే కేంద్రం తప్పు.. అన్నట్టుగా మాట్లాడుతున్న ఈయన తీరుపై వారు మండి పడ్డారని సమాచారం. 

దీంతో బాబు తక్షణం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మళ్లీ మాట మార్చి.. నోట్ల రద్దు వ్యవహారాన్ని నేను వ్యతిరేకించలేదు.. అని బాబు చెప్పుకొచ్చారు! తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది అని ఆయన చెప్పుకొచ్చారు. కలెక్టర్ల సదస్సుల్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చి.. బాబు వివరణ ఇచ్చుకున్నారు! కేంద్రం నుంచి వ్యక్తమైన అసంతృప్తి ఫలితమే మళ్లీ ఈ మాట మార్పిడి అని తెలుస్తోంది.
 

Show comments